పెళ్లి అనేది ఆడ, మగ మధ్య ఓ అద్భుతమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. పెళ్లి తర్వాత ఓ ఇద్దరు మనుషులు జంటగా జీవితాన్ని మొదలుపెడతారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే బంధంలో ఎలాంటి గొడవలు రావు. అలా కాకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. నిత్యం జరిగే గొడవల కారణంగా బంధంలో ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా చూసుకోవాలి. ఆ గొడవలు ఇద్దరి మధ్యా అండర్‌స్టాండింగ్‌ను పెంచేలా ఉండాలి. అలాగని పదే పదే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడ్డం కూడా మంచిది కాదు. దీని వల్ల భవిష్యత్ కాలంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఒక్కోసారి ఎదుటి వ్యక్తిపై నమ్మకం కూడా పోతుంది. అందుకే ప్రతీ విషయంలో ఆచి తూచి అడుగులు వెయ్యాలి. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను కలిసి ఎదుర్కోవాలి. ప్రతీదాన్ని బూతద్ధం పెట్టి చూడటం మానుకోవాలి.
ముఖ్యంగా భార్యకు భర్తపై కానీ, భర్తకు భార్యపై కానీ, అనుమానం ఉండకూడదు. సగానికిపైగా కాపురాలు కూలిపోవటానికి ప్రధాన కారణం అనుమానం. అనుమానాల కారణంగా కాపురాలు ఎక్కువ కాలం నిలవవు. నిత్యం నరకకూపంగా ఆ దాంపత్య జీవితం మారుతుంది. అందుకే అనుమానాలకు తావిచ్చే ఏ పని ఎవ్వరూ చేయకూడదు. అలాగని, ప్రతీ చిన్న విషయానికి ఎదుటి వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేయకూడదు. ఒక వేళ అనుమానం అన్నది పీక్స్‌లో ఉంటే సైకాలజిస్టుల సలహా తీసుకోవటం ఉత్తమం. వారు చెప్పిన విధంగా నడుచుకోవాలి. ఏ కాపురమైనా సక్రమంగా సాగాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ఎంత తిట్టుకున్నా.. కొట్టుకున్నా ఒకరిని ఒకరు గౌరవించుకోవటం తప్పని సరి.