అన్ని ప్రేమ కథలు తీరానికి చేరే నావలు కాదు. అర్థాంతరంగా ఆగిపోయిన ప్రేమలు మరిచిపోలేని చేదు జ్ఞాపకంలా జీవితంలో మిగిలిపోతాయి. కారణాలు ఏవైనా కావచ్చు.. ఓ ఇద్దరి మధ్య మొదలైన బంధం మధ్యలోనే తెగిపోవటం సహజం. ఎదుటి వ్యక్తిపై పూర్తిగా ప్రేమ భావం నశించి.. ఒకరు బ్రేకప్ చెప్పటం వల్ల మరో వ్యక్తి బాధకు లోనవుతాడు. ఇందులో ఒకరిదే బాధ. ఇలాంటి ప్రేమలు మళ్లీ గాడిలో పడటం చాలా కష్టం. ఇక, ఇద్దరి సమ్మతంతో విడిపోయినప్పుడు ఇద్దరిలోనూ విడిపోయామన్న బాధ ఉంటుంది. ఈ బాధ ప్రతీ క్షణం ఓ పురుగులా మనసును తొలుస్తూ ఉంటుంది. ఒకరికి పెళ్లై ఒకరు ఒంటరిగా మిగిలినా..
లేదా ఇద్దరికీ పెళ్లయినా ఈ ప్రేమను అంత తొందరగా మర్చిపోలేరు. ఒక వేళ ఆ వచ్చిన భాగస్వామి మనసుకు దగ్గర కాకపోతే నరకం చూడాల్సి వస్తుంది. అంతేకాదు.. మనం దూరం అయిన వ్యక్తి ఎప్పుడూ గుర్తుకు వస్తూ ఉంటారు. అరే అనవసరంగా ఆ వ్యక్తిని దూరం అయ్యామే అన్న బాధ మొదలవుతుంది. ఆ వ్యక్తితో జీవితాన్ని పంచుకుని ఉంటే జీవితం మరోలా ఉండేది అనిపిస్తుంది. ఇదొక లాంటి బాధ అయితే.. ఇంకొంతమందిలో వచ్చిన భాగస్వామి ఎంత మంచి వారైనా ప్రేమించిన వారిని మర్చిపోలేకపోతుంటారు. అనుక్షణం ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటూ వైవాహిక జీవితాన్ని కూడా ఇబ్బందుల్లో పడేస్తుంటారు. అయితే, ఇలాంటి ప్రేమ రెండు జీవితాలను కాదు.. రెండు కుటుంబాల్ని నాశనం వైపుగా నడిపిస్తుంది.
ఇలాంటి టైంలో మెచ్యూర్‌గా ఆలోచించటం చాలా అవసరం. హద్దుల్లో ఉండి.. ఆలోచనల్ని అదుపులో పెట్టుకుని ముందుకు వెళితే గనుక.. మాజీలతో మళ్లీ ఓ కొత్త స్నేహాన్ని కొనసాగించవచ్చు. ఓ మంచి స్నేహితురాలి లాగో.. స్నేహితుడిలాగో మన మాజీలతో జీవితాంతం ముందుకు సాగొచ్చు. మన కష్ట, సుఖాలు(అన్నీ కాదు)పంచుకునే ఓ మంచి ఫ్రెండ్‌లా ఎదుటి వ్యక్తితో ఉండొచ్చు. ఆ స్నేహం కేవలం ఇద్దరీ మధ్యా స్వచ్ఛమైన అనుబంధానికి వారధిగా ఉండాలి. ఇందులో అశ్లీలతకు, అవసరాలకు ఎలాంటి తావు ఉండకూడదు. ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మాజీలను మర్చిపోయి ఉండగలమా ? లేదా? అని. ఒక వేళ లేము అనుకుంటే కొన్ని విషయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
జీవిత భాగస్వామి మానసిక పరిస్థితి
పెళ్లి తర్వాత మాజీలతో స్నేహ బంధం కొనసాగించాలంటే ఈ విషయాన్ని తప్పుకుండా పరిగణలోకి తీసుకోవాలి. పెళ్లి అనే బంధం ద్వారా మన జీవితంలోకి వచ్చిన భాగస్వామి మానసిక పరిస్థితి ఏంటి? అతడు లేదా ఆమె మన స్నేహ బంధాన్ని స్వాగతిస్తారా? అనుమానిస్తారా? అన్న కోణంలో తప్పక ఆలోచించాలి. తద్వారా భవిష్యత్తు అంధకారంలో పడకుండా ఉంటుంది. ఇద్దరి జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి.
కుటుంబం
ఒక వేళ మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మీ స్నేహాన్ని స్వాగతించగలిగితే.. ఆ తర్వాత వారి కుటుంబం గురించి కూడా ఆలోచించండి. వారు మీ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారా? లేదా? మీకు ఆ కుటుంబంలో ఎలాంటి స్థానం ఉంది? ఆ కుటుంబంలోని వారి మానసిక పరిస్థితి ఎలాంటిది? ముఖ్యంగా వారి బుద్ధి ఎలాంటిది? అన్న విషయాలు పరిగణలోకి తీసుకోవాలి.
మీ గతాన్ని భాగస్వామికి చెప్పొద్దు..
వివాహ బంధంలోకి అడుగుపెట్టినా కూడా మన జీవితంలోని ప్రైవసీ మనకు ఉండాలి. మన గతంలో జరిగిన అన్ని విషయాలు భాగస్వామికి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రేమ గురించి. ఎందుకంటే ఇది భవిష్యత్తులో అనుమానాలకు దారి తీసే అవకాశం ఉంది. మీ మాజీలతో ప్రస్తుతం మీకు కేవలం స్నేహం మాత్రమే ఉన్నా. దాన్ని వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఒక వేళ మీ గత ప్రేమ గురించి చెప్పి ఉంటే.. మాజీలతో స్నేహం గురించి తప్పక ఆలోచించాలి.
దేనికైనా హద్దులు తప్పని సరి
అతి సర్వత్రా వర్జయేత్ అన్నది ఏ విషయానికైనా వర్తిస్తుంది. పెళ్లి తర్వాత మనం కొనసాగించబోయే బంధానికి తప్పకుండా హద్దులు ఉండాలి. హద్దులు మించినది స్వచ్చమైన స్నేహమైనా సరే అనర్థాలకు దారి తీస్తుంది. ఒక జీవితాన్ని కాదు.. రెండు కుటుంబాల్ని రోడ్డున పడేస్తుంది.