ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రతి ఏటా అందాల పోటీలు నిర్వహిస్తుంటాయి. ఆయా దేశాల్లో అందాల పోటీల్లో రాణించిన సుందరీమణులందరి నుంచి మిస్ యూనివర్స్‌ను ఎంపిక చేస్తారు. గతేడాది మన దేశానికి చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుంది. ఇక తాజాగా ఈ ఏడాది కూడా మన దేశంలో ఫెమినా మిస్ ఇండియా పోటీలు నిర్వహించారు. ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ పోటీల్లో కర్ణాటకకు చెందిన సినీ శెట్టి మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్నారు. నిర్వాహకులు ఆమెను విజేతగా ప్రకటించారు. రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సినట చౌహాన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. మిస్ ఇండియా తెలంగాణ ప్రజ్ఞా అయ్యగారి నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. గార్గీ నందీ అయిదో స్థానంలో నిలిచారు.
సినీ షెట్టి స్వరాష్ట్రం కర్ణాటక. ముంబైలోనే పుట్టి పెరిగారు. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఛార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్స్ చేస్తోన్నారు. భరతనాట్య కళాకారిణి కూడా. ఇదివరకు ఈ టైటిల్‌ను సాధించిన లారా దత్తా, సారా జేన్ డయాస్, సంధ్యా ఛిబ్, నఫీసా జోసెఫ్, రేఖ హండె, లిమారైనా డిసౌజా కర్ణాటకకు చెందినవారే. ఇప్పుడిదే జాబితాలో సినీ శెట్టి చేరారు.
బాలీవుడ్ నటులు నేహా ధుపియా, కృతి సనన్, మనీష్ పాల్, రాజ్ కుమార్ రావ్, డినో మోరియా, మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్, మలైక అరోరా, డిజైనర్ రోహిత్ గాంధీ, కోరియోగ్రాఫర్ షియామక్ దావర్‌తో కూడిన ప్యానెల్.. విజేత పేరును ప్రకటించింది. ఈ కార్యక్రమానికి పరిమితంగా సెలెబ్రిటీలు హాజరయ్యారు. బాలీవుడ్ సెలెబ్రిటీస్ రాకతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యానికి చెందిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కళకళలాడింది. ఇక మిస్ ఇండియా తెలంగాణ ప్రజ్ఞా అయ్యగారి.. టాప్-3లో నిలవలేకపోయారు. నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.