గుడ్లను ఎప్పుడు మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి ఉడికించకూడదు. అలా చేస్తే పేలుడు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలామంది గుడ్లను మైక్రో ఓవెన్లో పెట్టి ఉడికిస్తున్నారు. ‘టిక్‌టాక్’లో వివిధ రకాల చిట్కాలను చెబుతున్నారు. కొందరు వాటిని గుడ్డిగా అనుసరిస్తూ ప్రమాదంలో పడుతున్నారు. ఇంగ్లాండ్‌లోని బోల్టాన్‌లో నివసిస్తున్న చాంటెల్లే కాన్వే అనే మహిళ కోడి గుడ్లను ఉడకబెట్టేందుకు మైక్రో ఓవెన్‌ను ఉపయోగిస్తోంది. సులభంగా, వేగంగా గుడ్లు ఉడుకుతాయనే ఉద్దేశంతో ఆమె కొన్నాళ్లుగా ఈ పద్ధతినే పాటిస్తోంది. అయితే, ఇటీవల ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. మైక్రో ఓవెన్‌లో ఉడికించిన గుడ్లు ఒక్కసారే బాంబులా పేలాయి. ఆమె ముఖం మెడ కాలిపోయాయి. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.
2019లో కూడా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంగ్లాండ్‌లోని వర్సెస్టర్‌సైర్ నగరానికి చెందిన బెదానీ రాసర్ గుడ్లను ఉడికించాలని అనుకుంది. ఈ సందర్భంగా మైక్రోవేవ్ ఓవెన్‌లో గుడ్లను ఉడికించే విధానం గురించి ఓ పుస్తకంలో చదివింది. అందులో పేర్కొన్నట్లు ఆమె పాత్రలో నీళ్లు నింపి గుడ్లు పెట్టింది. అవి పేలకుండా ఉండేందుకు ఉప్పు వేసింది. ఆ గుడ్లు మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉన్నంత సేపు బాగానే ఉన్నాయి. బయటకు తీసిన వెంటనే పేలిపోయాయి. దీంతో ఆమె ముఖం కాలిపోయింది. గుడ్డు కంటిని తాకడంతో కన్ను వాచిపోయింది.
సో… టిక్ టాక్ వీడియోలని చూసి ట్రై చేస్తే ఒక్కోసారి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. జర జాగ్రత్త.