ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. న్యూస్‌లో ప్రతీ రోజు ఓ రెండు, మూడు వార్తలు తప్పని సరిగా ఉంటున్నాయి. ఆ ఊరు ఈ ఊరు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా ఇలాంటి పనులు ఎక్కువయిపోయాయి. అయితే, 100కు 10 శాతం మంది చేసే ఈ తప్పులు 90 శాతం మంది ఆడవారిని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కొంతమంది భర్తలు తరచుగా భార్యల్ని అనుమానిస్తున్నారు. ఫోన్‌లో మాట్లాడినా.. గట్టిగా నవ్వినా.. బయటకు వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చినా.. అందంగా తయారైనా.. ఆఖరికి శృంగారం గురించి మాట్లాడినా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది మగాళ్లు తమ అనుమానానికి పొససివ్‌నెస్ అని పేరు పెట్టుకుని దారుణాలకు పాల్పడుతున్నారు. భార్య అంటే తమ బానిస అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
నిజం చెప్పాలంటే అనుమానం అన్నది మందు లేని ఓ జబ్బులాంటిది. ఒకసారి మొదలైతే దాన్నుంచి బయటపడటం చాలా కష్టం. ఇది ఒకరకంగా మానసిక రోగం అని చెప్పొచ్చు. భార్యపై అనుమానం మొదలైన భర్తలకు హద్దు అదుపు ఉండదు. ఎప్పుడూ భార్యల గురించే ఆలోచిస్తూ ఉంటారు. భార్యలు ఏం చేసినా తప్పు చేస్తున్నారని అనుకుంటుంటారు. చాలా కాపురాల్లో గొడవలకు కారణంగా ఈ అనుమానమే అయి ఉండటం గమనార్హం. ఈ అనుమానం పెరిగితే గనుక ఆత్మహత్యలకు లేదా హత్యలకు దారి తీస్తుంది. భర్త భార్యను చంపటం లేదా.. భర్తే ఆత్మహత్య చేసుకోవటం జరగొచ్చు. అలా కాకుంటే భార్యే ఆత్మహత్య చేసుకోవచ్చు.. లేదా భర్తను హత్య చేయవచ్చు.
ఒకరకంగా చెప్పాలంటే అనుమానం అన్నది నమ్మకాలను, నిజాలను పాతి పెడుతుంది. అనుమానంతో ఉన్న వ్యక్తులు నిజాలకంటే తాము అనుకుంటున్న దాన్నే ఎక్కువగా నమ్ముతారు. తాము నమ్మేదే నిజం అనుకుంటారు. గట్టిగా చెప్పాలంటే ఆడది తప్పు చేయాలని నిజంగా అనుకుంటే వారిని నిలువరించటం చాలా కష్టం. వారిని అడ్డుకోవటం, ఆపటం మగాడి వల్ల కాదు. ఇది తెలిసి కూడా కొంతమంది మగాళ్లు తమ భార్యల్ని ప్రతీ విషయంలో అనుమానిస్తూ ఉంటారు. మంచి వాళ్లను కూడా ఇబ్బంది పెడుతుంటారు. కొంతమందైతే భార్యలకు నరకం చూపిస్తున్నారు. దీని వల్లే చాలా కాపురాలు విడాకుల వరకు వెళుతున్నాయి. మరికొన్ని హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి.
కార్యేషు దాసి..
కరణేషు మంత్రి..
భోజ్యేషు మాతా..
రూపేచ లక్ష్మీ..
శయనేషు రంభ..
క్షమయా ధరిత్రీ..
భార్య ఎలా ఉండాలో చెబుతూ పెద్దలు అన్న మాటలివి. వీటి అర్థం మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. భర్తకు పని చేసి పెట్టే విషయంలో భార్య ఓ దాసిలా.. సలహాలు ఇవ్వడంలో మంత్రిలా.. భోజనం పెట్టడంలో తల్లిలా.. అందంలో లక్ష్మిలా.. పడక గదిలో సుఖాన్ని అందించటంలో రంభలా.. క్షమించే గుణంలో భూమాతలా ఉండాలి. పైన చెప్పిన విధంగా ఉండటం భార్యలందరి వల్ల కాదు. భర్తలే ప్రేమతో.. ఓర్పుతో తమకు తగినట్లుగా భార్యలను మలుచుకోవాలి. వారికి స్వేచ్ఛను ఇవ్వాలి. వారిని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ.. అనుమానాలతో మాత్రం వేధించకూడదు. ఇది ఇద్దరి జీవితాలకు మంచిది కాదు.