మొక్కజొన్న గింజలు బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడక బెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు ‘పాప్ కార్న్’, ‘కార్న్ ఫ్లేక్స్’ తయారుచేస్తారు. లేత ‘బేబీ కార్న్’ జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. గింజల నుండి నూనె తీస్తారు. పశువుల దాణ, కోళ్ల దాణాగా ఉపయోగిస్తారు. బేకింగు పౌడర్ల తయారీలో వాడే పిండి పదార్థం రూపంలోను, అనేక రకాల మందుల తయారీలలోను, విస్కీ తయారీలోను మొక్కజొన్న వాడుతున్నారు. సూప్ తాగినా సలాడ్‌గా తిన్నా ఏ రూపంలో తీసుకున్నా మొక్కజొన్న రుచే వేరు. చిరుతిండిగా తినే పాప్‌కార్న్ సంగతి సరేసరి. సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్న నేడు ప్రపంచవ్యాప్త ఆహారంగా మారింది. ఒకప్పుడు మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్నను మాయన్లు పెంచి పోషించారని చెప్పాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకూ దీన్ని వాళ్లు కూరగాయగానూ అల్పాహారంగానూ చిరుధాన్యంగానూ వాడుతూనే ఉన్నారు. అంతేకాదు, జన్యుమార్పుల ద్వారా మేలైన వంగడాలనూ సృష్టిస్తున్నారు.
బేబీ కార్న్‌తో చాలా మంది అనేక రకాల వంటకాలు చేసుకుని తింటుంటారు. బేబీ కార్న్ కేవలం రుచిలో మాత్రమే కాదు, మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలోనూ బాగా పనిచేస్తుంది. బేబీ కార్న్‌లో మన శరీరానికి అవసరమైన కీలకమైన పోషకాలు ఉంటాయి. మొక్కజొన్నలో ఖనిజాల శాతమూ ఎక్కువే. ఫాస్ఫరస్ మూత్రపిండాల పనితీరుకి తోడ్పడితే, మెగ్నీషియం ఎముక బలాన్ని పెంచుతుంది. మనం సరదాగా కాలక్షేపంకోసం తినే రుచి కరమైన మొక్కజొన్నలో తియ్య దనంకోసం మొక్కజొన్న నుంచి తీసిన కార్న్ సిరప్‌ను ప్రాసెస్‌డ్ ఆహారపదార్థాలూ శీతలపానీయాల్లో వాడుతుంటారు. ఈ సిరప్‌లో ఫ్రక్టోజ్ శాతం ఎక్కువ. అది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. కాబట్టి వాటితో మాత్రం కాస్త జాగ్రత్త.