అభ్యంగన స్నానం అనేమాట చాలా మందికి అనుమానం ఉంటుంది. ఈ అభ్యంగన స్నానం అంటే ఏమిటి అని. స్నానం అనేది రోజూ చేయాల్సిందే, కచ్చితంగా తనువు అంతా తడిచి ఆ దేవుడిని ప్రార్ధిస్తూ స్నానం చేయాలి. పురుషులు రోజూ తలారా స్నానం చేస్తే మంచిది. ఇక అభ్యంగన స్నానం అంటే తలంటు స్నానం అని చెబుతారు. అయితే పురుషులు ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు మినహా ప్రతీ రోజూ తల స్నానం చేస్తే మంచిది. ఇలా తలస్నానం చేసి నిత్యం దేవాలయానికి వెళ్లాలి. ఉదయం 5 గంటలకే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం మంచిది. చన్నీటి స్నానం శిరస్సు నుంచి ప్రారంభించాలి. వేడి నీటి స్నానం పాదాల నుంచి ప్రారంభించి తరువాత శరీరం తడపాలి. పర్వదినాలలోనూ, జన్మదినముననూ, విశేష క్రతువుల ప్రారంభంలోనూ అభ్యంగన స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి.
అభ్యంగనము – వాత, కఫ దోషాలను శారీరక బడలికను పోగొట్టి బలాన్ని కలిగిస్తుంది. దేహకాంతి, మంచి కంటి చూపు, సుఖ నిద్రను కలిగిస్తుంది. ఆయుష్షును వృద్ధి చేస్తుంది. ప్రతిరోజూ చెవులలో కొద్దిగా తైలపు చుక్కలు వేసుకోవడం వలన చెవులలోని మాలిన్యములు తొలగిపోతాయి. శద్ధగ్రహణం బాగుంటుంది. చెవిపోటు, ఇతర సమస్యలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను ఉంటుంది కాబట్టి ఆ శక్తి కూడా మనకు వస్తుంది. ఇలా అభ్యంగన స్నానం చేస్తే ఆ దైవ అనుగ్రహాన్ని పొందుతారు.
శిరస్సు మీద నూనె మర్దనా చేయడం వలన మెదడు శక్తివంతమవుతుంది. కళ్ళులు, చెవులు, దంతములకు ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరాభ్యంగము వలన తైలం రోమకూపములలో నుండి లోనికి ప్రవేశించి నరములు, రక్తనాళములలో ఎంతో చురుకుదనాన్ని కలిగిస్తుంది. ధాతువులను వృద్ధి చేస్తుంది.
వివిధ రకాల జ్వరములతో బాధపడేవారు, అజీర్ణవ్యాధులతో బాధపడేవారు, విరేచనములగుటకు ఔషదం తీసుకున్నవారు తైలంతో అభ్యంగము చేయకూడదు.