భార్యాభర్తల బంధం ఎంతో అందమైనది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, నమ్మకం అనే పునాదులపై ఈ బంధం నిలబడి ఉంటుంది. భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి అంటే ఇవన్నీ సమపాళ్లలో ఉండాలి. వాటిలో ఏ ఒక్కటి తగ్గినా ఆ బంధంలో అరమరికలు తప్పవు. వీటి గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే.. ఇప్పుడు చెప్పుకోబోయే విషయం ఆ అంశాలపైనే ఆధారపడి ఉంది కాబట్టి. అందులో ఒకటి తగ్గబట్టే ఓ పచ్చని సంసారంలో నిప్పులు కురిశాయి. ఓ భార్య మానం, ఓ భర్త నమ్మకం మట్టికలిశాయి. తాను చేసిన తప్పు ఏంటో ఆ భర్త తెలుసుకునే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలు అతను చేసిన తప్పు ఏంటి? ఆ తప్పు వల్ల జీవితంలో అతను ఏం కోల్పోయాడు? అనే విషయాలు తెలుసుకుందాం.
ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. జీతం తక్కువే అయినా జీవితాన్ని మాత్రం ఎంతో ఆనందంగా గడిపేవారు. భార్య అంటే భర్తకు, భర్త అంటే భార్య ఎనలేని ప్రేమ. వారి సంసారం చూసి ఇరుగుపొరుగు వారు కూడా ఈర్ష్య పడేవారు. కొన్నాళ్లపాటు వారి జీవితం సాఫీగా సాగిపోయింది. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న బాధ్యతలు ఆ భర్తను జీవితం మీద కంటే జీతం ఎక్కువ శ్రద్ధ చూపేలా చేశాయి. అప్పటి వరకు ఉన్న పరిస్థితులు అన్నీ మారిపోయాయి.. ఆ భర్తతో సహా. ఇంట్లో ఒక భార్య ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. ఇంట్లో ఉంటే నిద్రపోవటం లేదంటే ఆఫీస్‌లో ఓటీ చేయడం ఈ రెండే చేస్తూ వచ్చాడు. అలా రెండు సంవత్సరాలు గడిచిపోయింది. అప్పట్లో ఉన్న ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, పలకరింపులు ఏవీ ఇప్పుడు లేవు.
మొదట్లో భర్త ప్రవర్తన చూసి భార్య ఎంతో బాధపడిపోయింది. తనని అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందింది. తాను అడకముందే కావాల్సినవన్నీ తెచ్చిపెడుతున్నాడు. భార్యకు ఖరీదైన చీరలు, నగలు కూడా కొనిస్తున్నాడు. కానీ, అవేవీ ఆమెను ఆనందంగా ఉంచలేకపోయాయి. రూ.500 చీర కొన్నప్పుడు ఆమె కళ్లలో ఉన్న మెరుపు రూ.5 వేల చీర ఇచ్చినా ఇప్పుడు ఉండటం లేదు. ఎందుకంటే రూ.500 చీర ఇచ్చినప్పుడు ఆ భర్త కళ్లల్లో ఆమైపై ప్రేమ కనిపించేది. కానీ, ఇప్పుడు కళ్లల్లో ప్రేమ, మాటల్లో అనురాగం రెండూ కనిపించడం లేదు. తాను కలలు కన్న జీవితం అది కాదని ఆమెకు అర్థమైంది. ఆ విషయం భర్తకు చెప్పే ప్రయత్నం చేసినా కూడా.. డబ్బు వెనుక పరుగులు పెడుతున్న ఆ భర్తకు అది వినిపించలేదు.
ఓ రోజు యదాలాపంగా పడకగదిలో కూర్చున్నాడు. పక్కనే తన భార్య ఫోన్ ఉంటే ఎందుకో ఆ ఫోన్ పట్టుకున్నాడు. అప్పుడే ఆమె వాట్సాప్‌కి ఓ మెసేజ్ వస్తుంది. అది చూసిన భర్త గుండె పగులుతుంది. వంటగదికి పరుగున వెళ్లి భార్యను చెపందెప్పకొడతాడు. ఇంతలా నమ్మితే అంత నమ్మకద్రోహం చేస్తావా అంటూ నిలదీస్తాడు. అతని చేతిలో ఫోన్ చూసి ఆ భార్యకు విషయం అర్థమైంది. భర్త కొట్టిన చెంపదెబ్బతో తన గుండెల్లోని భారం దిగిపోయినట్లు ముఖం పెట్టింది. అవును ఎప్పటి నుంచో మీతో చెప్పాలి అనుకుంటున్నాను కానీ కుదర్లేదు. మీరు చూసింది నిజమే అంటూ స్పష్టం చేసింది. భార్యను నోటికొచ్చినట్లు తిట్టాడు. అత్తమామలకు ఫోన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో భార్య ఒక్కటే చెప్పింది. నేను 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. ఆ తర్వాత మీరు ఏం చేసినా నాకు ఓకే అంటూ చెబుతుంది.
ఆమె కాళ్లావేళ్లా పడుతుందని ఊహించుకున్నాడు. “ఏడాదిన్నరగా నా ఫోన్‌కు అదే నంబర్ నుంచి అలాంటి మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. కానీ, అవి మీ కంట పడటానికి ఇంత టైమ్ పట్టింది. నేను అడగకుండానే చీరలు తెస్తారు, నేను అడగకుండానే నగలు తెస్తారు. ఒక్కరోజైనా నాకు ఏం కావాలి అని అడగాలి అనిపించలేదా? రోజూ ఒకే మంచంపై పడుకుంటున్నాం. నాతో ముద్దు ముచ్చట్లు ఆడి ఎన్ని రోజులు అవుతోంది. అసలు మనం ఏకాంతంగా గడిపి ఎన్ని నెలలు అవుతోందో గుర్తుందా? చీరలు, నగలు కోసం ఏ రోజూ వెంపర్లాడలేదు. మీతో 5 నిమిషాలు ఆనందంగా గడపాలని చూశాను. నేను చేసింది తప్పే.. నన్ను నేను సమర్థించుకోవాలి అని కూడా అనుకోవడం లేదు. చేసిన తప్పుని గుర్తుచేసుకుని రోజూ కుమిలిపోతూనే ఉంటాను. ఇదే విషయం మీతో చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. నేను ఇలా మారడానికి అంతర్లీనంగా కారణం ఎవరు? నా గుండెల్లో ఇంతటి బాధను దాచుకున్నాను అంటే దానికి మూలం ఏంటి? ఒక్కసారి మీరే ఆలోచించండి. మీరు నన్ను శిక్షిస్తానన్నా దానికి నేను సిద్ధమే” అంటూ ఆ భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంతకాలం తాను చేసిన తప్పు ఏంటి? తాను కోల్పోయింది ఏంటి? తన వల్ల భార్య ఎంత నరకం చూసింది అన్నీ అతని కళ్ల ముందు కదిలాడాయి. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. భార్యాభర్తలు ఆనందంగా గడపాలి అంటే డబ్బే ముఖ్యం అనుకుని సంసారాన్ని నాశనం చేసుకున్న విషయం తెలిసొచ్చింది. భార్యవైపు దీనంగా చూస్తూ ఉండిపోయాడు. ఇన్ని సంవత్సరాల్లో భర్తను అలా ఎప్పుడూ చూడలేదు. తన తప్పు తెలుసుకుని.. భార్యను క్షమించని వేడుకున్నాడు. తన ప్రవర్తన మార్చుకుంటానని.. మునపటిలా జీవించేందుకు ఒక్క అవకాశం ఇవ్వమని వేడుకున్నాడు. భర్త నుంచి ఏమైతే కోరుకుందే ఆ సమయం రానే వచ్చింది. ఆ భార్య తన ప్రవర్తన మార్చుకుంటానని మాటిచ్చింది. మళ్లీ వారి జీవితంలో మునపటి రోజులు తిరిగి తొంగి చూశాయి. ప్రతి రాత్రి వసంత రాత్రిగా మారిపోయింది. ఏడాది తిరిగే సరికి ఆమె పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది.