ఈ సృష్టిలోని 90 శాతం జీవులకు నిద్ర, ఆకలి ఎలాగో శృంగారం కూడా అలాంటిదే. కేవలం మన శారీరక కోర్కెలను తీర్చటం కోసం.. సంతానాన్ని పెంపొందించటం కోసం మాత్రమే కాదు.. ఓ జంట మధ్య బంధం కలకాలం నిలవటానికి శృంగారం ఎంతో మేలు చేస్తుంది. శృంగార జీవితం బాగున్న జంటలే ఎక్కువ సంతోషంగా తమ దాంపత్య జీవితాన్ని గడుపుతున్నాయి. అంతేకాదు.. శృంగార జీవితం బాగున్న జంటలే ఎంతో ఆరోగ్యంగా.. ఎక్కువ కాలం జీవిస్తున్నాయి. శృంగార జీవితం సరిగా లేని జంటలు తరచుగా అనారోగ్యం బారినపడుతున్నాయి. అంతేకాదు.. శృంగార జీవితం బాగున్న జంటల కంటే త్వరగానే కాలం చేస్తున్నాయి. అందుకే ఏ జంటకైనా శృంగారం జీవితం అన్నది ప్రధానమైనది. కొన్నికొన్ని తప్పుల కారణంగా జంటలో శృంగార జీవితం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ ఐదు తప్పులు ప్రైవేట్ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి.
1) అధిక ఒత్తిడి
ఈ మధ్య కాలంలో ఒత్తిడి అన్నది సర్వసాధారణం అయిపోయింది. తీరిక లేని, తీరిక దొరకని కంప్యూటర్ పనుల కారణంగా ఒత్తిడి మామూలైపోయింది. కేవలం ఉద్యోగస్తులనే కాదు.. ఇంట్లో ఉండి పనులు చూసుకునే గృహిణుల్లో కూడా ఈ సమస్య పెరిగిపోయింది. అయితే, కొంతమందిలో ఈ ఒత్తిడి మామూలుకంటే ఎక్కువగా ఉంటోంది. ఇదే ప్రైవేట్ జీవితాన్ని దెబ్బతిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. అధిక ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ పరిమాణం పెరిగిపోతుంది. తద్వారా మగవారిలో టెస్టోసిరాన్ పరిమాణాలు తగ్గిపోతాయి. దీంతో ఆ సామార్థ్యంపై ఆటోమేటిగ్‌గా దెబ్బపడుతుంది.
2) సరైన నిద్ర లేకపోవటం
ఈ సృష్టిలోని ప్రతీ జీవికి నిద్ర అన్నది ఓ అత్యవసరం. కేవలం మన ఒత్తిడి తీర్చుకోవటం కోసమే కాదు.. శరీరంలోని కొన్ని ముఖ్య అవయవాలకు కూడా విశ్రాంతి అవసరం. నిద్ర ద్వారానే ఆ అవయవాలు కొత్త శక్తిని పొందుతాయి. అలాంటిది నిద్ర కరువైతే ఆ అవయవాల పని తీరుపై ప్రభావం పడుతుంది. అది అటు,ఇటు తిరిగి శృంగార జీవితాన్ని దెబ్బ తీస్తుంది. నిద్రలేమి కారణంగా చాలా నష్టాలు సంభవిస్తాయి. శరీరంలోని హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతింటుంది.
3) హార్మోన్ల అసమతుల్యత
ఈ మధ్య కాలంలో మనుషుల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ప్రైవేట్ జీవితంపై ప్రభావం పడుతుంది. మగవారిలో కావచ్చు.. ఆడవారిలో కావచ్చు.. కోర్కెల్ని కలిగజేసేది హార్మోన్లు. శృంగార హార్మోన్ల కారణంగా మనలో కోర్కెలు ఉద్భవిస్తాయి. హార్మోన్లు అతిగా పనిచేసినా.. తక్కువగా పని చేసినా.. అసలు చేయకపోయినా మనకు కలిగే కొర్కెల్లో తేడా ఉంటుంది.
4) భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు
మనషులన్న తర్వాత గొడవలు సహజం. ఇక పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరగటానికి ప్రత్యేక కారణమంటూ ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒక చిన్న విషయానికి కూడా భార్యాభర్తలు గొడవపడుతూ ఉంటారు. అయితే, ఈ గొడవలు ఇద్దరి మధ్యా బంధాన్ని బలంగా చేస్తే పర్లేదు. అలా కాకుండా గొడవల కారణంగా రోజురోజుకు దూరం పెరుగుతూ ఉంటే.. ఆలోచించాల్సిందే. గొడవ పడ్డ ప్రతీసారి ప్రైవేట్ లైఫ్ దెబ్బతింటుంది. అందుకే భార్యాభర్తలు మంచి అవగాహనతో ఉండాలి. గొడవలు రాకుండా చూసుకోవాలి. వచ్చినా కూడా అవి బంధాన్ని మరింత బలపడేలా చేసేలా ఉండాలి.
5) శృంగారంలో అసంతృప్తి
శృంగారం అన్నది టూ వే ప్రాసెస్. దీని ద్వారా భార్యాభర్తలు ఇద్దరూ సంతృప్తి పొందగలగాలి. అయితే, అన్ని సార్లు అలా జరగకపోవచ్చు. కొన్ని సార్లు ఎదుటి వ్యక్తిని తృప్తి పర్చటం కుదరకపోవచ్చు. అది అలాగే కంటిన్యూ కావచ్చు కూడా. ఎవరో ఒకరు ఇబ్బందికి గురవుతూ ఉండొచ్చు. ఈ విషయం ఎదుటి వ్యక్తికి తెలియకుండానే పోవచ్చు. ఇదే తర్వాతి కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుంది. కాపురాలు కూలడానికి శృంగారంలో అసంతృప్తి ఓ ప్రధాన కారణంగా మారుతోంది. కాబట్టి.. ఎప్పటికప్పుడు ప్రైవేట్ లైఫ్ గురించి ఎదుటి వ్యక్తితో చర్చిస్తూ ఉండాలి. వారికి ఏది ఇష్టమో.. ఏది ఇష్టం లేదో తెలుసుకుని మసలుకోవాలి. కొన్ని సార్లు ఎదుటి వ్యక్తి తమ సమస్యను చెప్పుకోలేకపోవచ్చు. అందుకే.. ముందడుగు మీదే అవ్వాలి.