మన చుట్టుపక్కల చాలా మంది జీవితాల్లో కోరినంత జీతం, విలాసవంతమైన ఇల్లు, కారు, ఇలా ఎన్ని వసతులు ఉన్నా కూడా ప్రశాంతమైన జీవితం మాత్రం గడపలేకపోతున్నారు. కొందరైతే చిన్న కారణాలతో తమ పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. కొందరు క్షణికావేశంతో, మరికొందరు చెప్పుడు మాటలు విని తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే తమ జీవిత భాగస్వామి కోసం ఇంకో అవకాశం ఇవ్వడం తప్పులేదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎవరూ 100 శాతం పర్ఫెక్ట్ కాదు కదా? మరి ఆ ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలో తెలుసుకుందాం.
లైఫ్ లో అందరూ తప్పులు చేస్తుంటారు. భార్య, భర్త ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా దానిని భూతద్దంలో పెట్టి చూడకూడదు. ఆ తప్పు వల్ల ఎంత నష్టం కలిగినా కూడా అవతలి వారిపై కోపం ప్రదర్శించకూడదు. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉందేమో ముందు ఆలోచించాలి. అలాంటి అవకాశం ఉంటే తప్పుకుండా వారి తప్పును సరిదిద్దుకునేలా ప్రోత్సహించాలి. కావాలని ఎవరూ తప్పులు చేయరు అనేది గుర్తుంచుకోవాలి.
మిమ్మల్ని బాధ పెట్టినంత మాత్రాన మీ జీవిత భాగస్వామి చెడ్డవారు అయిపోరు అనేది గుర్తుంచుకోండి. ఎందుకంటే కావాలని ఎవరూ ఎదుటి వారిని బాధపెట్టరు. జీవిత భాగస్వామిని బాధ పెట్టి ఎవరూ ఆనందాన్ని పొందరు. ఏదో కోపంలోనో లేదా అసహనంతోనో మాత్రమే అలా చేస్తుంటారు. అలాగని వారికి మీ మీద ప్రేమ లేదని కాదు. అలాంటి పరిస్థితి వస్తే వెంటనే నిర్ణయాలు తీసుకోకండి.
భార్యాభర్తలు అన్నాక గిల్లిగజ్జాలు సాధారణంగానే జరుగుతుంటాయి. ఆఫీసుల్లో ఒత్తిడి ఎక్కువైతే కొన్నిసార్లు ప్రతి చిన్న విషయంలోనూ గొడవలు పడుతుంటారు. మీ పార్టనర్ కోపగించుకుంటే మీరు తిరిగి అరవడం ఎంత మాత్రం ప్రోత్సహించదగినది కాదు. వారు కూల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. వాళ్లే వచ్చి సారీ చెప్పే దాకా వెయిట్ చేయండి. తప్పు తెలుసుకోగానే మీ భాగస్వామి తప్పకుండా క్షమించమని అడుగుతారు. అలాంటప్పుడు పాత వివాదాలను తెర మీదకు తీసుకురాకూడదు.
కాపురంలో చమత్కారాలు ఎంత కామనో.. భార్యాభర్తల మధ్య దెప్పిపొడుపులు కూడా అంతే కామన్. అవి హెల్తీ కన్వర్జేషన్ లో జరిగితే మంచిదే. ఎప్పుడు పోయిన ఉగాదికి మీరు నాకు కొత్త చీర కొనలేదు.. మొన్న వారం నేను అడిగిన కూర చేయలేదు అంటూ ఇలా జరిగిపోయిన వాటిని ఎత్తి చూపిస్తూ మీ భాగస్వామిని దెప్పి పొడవకండి. ఎందుకంటే ప్రతిసారి అవి మంచి ఫలితాన్ని ఇవ్వవు. ఎదుటివాళ్లు ఏదైనా తప్పు చేస్తే.. వాళ్లు దాని గురించి బాధ పడతారు. మళ్లీ వాటిని గుర్తి చేసి ఎదుటి వారిని బాధ పెట్టకండి.
దాంపత్య జీవితంలో గొడవలు సహజం. అవి కొన్నిసార్లు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సమసి పోతాయి. కానీ, ప్రతిసారి అలాంటి వాతావరణం ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో మిత్రుల సలహా తీసుకోవడం తప్పేం కాదు. కానీ, ఆ మిత్రులు ఎలాంటి వారు అనేది దృష్టిలో ఉంచుకుని సలహా అడగాలి. ఫ్రెండ్ అనేవాళ్లు ఎవరైనా ఇలాంటి గొడవలు సహజం సర్దుకుపొండి.. మరో అవకాశం ఇవ్వండి అనే చెబుతారు. అలాంటి సలహాను స్వీకరించడం తప్పేం కాదు. ప్రతిదానికి పెద్దల దగ్గర పంచాయితీ పెట్టడం కంటే మంచి స్నేహితుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
మీ జీవితం సంతోషంగా సాగాలి అంటే ఏ సందర్భంలోనైనా కోపంగా నిర్ణయాలు తీసుకోకండి. ఒక్క నిమిషం ఆగి ఈ కారణానికే నేను నా భాగస్వామిని వదులుకోవాలా? అనే ప్రశ్ను వేసుకోండి. మీ పార్టనర్ కు ఇంకో అవకాశం ఇచ్చి చూడండి. మీ జీవితం ఆనందమయం అవుతుంది.