కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మధ్యమధ్యలో గ్యాప్ ఇచ్చినప్పటికీ కరోనా ఎఫెక్ట్ మాత్రం తీవ్రస్థాయిలోనే బాధిస్తోంది. ఈ మహమ్మారి వలన ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. కానీ నేర్చుకున్న విద్యాబుద్ధులను ఉపయోగించి కొత్తగా ఆలోచిస్తే.. సరికొత్త ఉపాధి కల్పించుకోవచ్చని నిరూపించారు కేరళకు చెందిన ముగ్గురు బీటెక్ గ్రాడ్యుయేట్లు.
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏదైనా వ్యాపారం ప్రారంభించి సక్సెస్ అవ్వాలంటే.. ఖచ్చితంగా ఆలోచనతో పాటు పట్టుదల, కృషి అనేవి ఉండాల్సిందే. ఈరోజుల్లో టీ కొట్టు(Tea Stall) పెట్టడం అనేది పెద్ద విషయం కాదు. తక్కువ పెట్టుబడితో కృషి చేస్తే ఛాయ్ బండి కూడా మనల్ని లక్షాధికారులను చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అదే ఛాయ్ కాన్సెప్ట్ తో.. కేరళకు చెందిన ఆనంద్ అజయ్, మహమ్మద్ షఫీ, మహమ్మద్ షనావాస్ అనే ముగ్గురు బీటెక్ హోల్డర్లు లక్షలు గడిస్తున్నారు.
అదెలాగో చూద్దాం.. కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఈ ముగ్గురు ఉపాధి లేక.. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి సరికొత్త బిజినెస్ కి నాంది పలికారు. రూ.1.5 లక్షల పెట్టుబడితో కొల్లమ్ అనే ప్రాంతంలో ‘బీటెక్ ఛాయ్’ పేరుతో టీ స్టాల్ ప్రారంభించారు. టీ స్టాల్ పెట్టడం అనేది గొప్ప విషయం కాదు. అందులో సక్సెస్ అవ్వడమే అసలైన గొప్ప విషయం. అందరిలాగే టీ పెట్టి అమ్మేలా అయితే బిజినెస్ రన్ అవ్వడం కష్టం.. కాబట్టి డిఫరెంట్ గా టీ లవర్స్ ని ఆకర్షించేలా టీలో వెరైటీ రకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
సామాన్యులకు అనువుగా ఉండేలా రూ.5 – 45 వరకు రకరకాల టీలను ప్రవేశపెట్టారు. మాములుగా అయితే.. మనకు టీలలో.. అల్లం, లెమన్, బాదాం, హనీ, బ్లాక్ లాంటివే చూస్తూ ఉంటాం. కానీ బీటెక్ ఛాయ్ స్టాల్ లో.. 50 రకాల టీలను అందిస్తున్నారు ఆనంద్ అజయ్, మహమ్మద్ షఫీ, మహమ్మద్ షనావాస్. కస్టమర్లకు కావాల్సిన టేస్ట్ లలో.. పైనాపిల్, స్ట్రాబెర్రీ, చాకొలేట్, బాదాంపిస్తా, వెనీలా, డెయిరీ మిల్క్, బట్టర్, మింట్, గింజా చాయ్, కుంకుమ పువ్వు చాయ్ వీరి దగ్గర బాగా ఫేమస్. ముఖ్యంగా గింజా చాయ్ వెరీ వెరీ స్పెషల్ అంటున్నారు కొల్లామ్ ప్రజలు.
ఈ గింజా టీని 10 రకాల మసాల దినుసులతో తయారు చేస్తారట. ఆ గింజా ఛాయ్ ద్వారానే బీటెక్ ఛాయ్ బండికి ఆదాయం తెచ్చిందని.. అదే మా సక్సెస్ మంత్ర అని చెబుతున్నారు ఈ ముగ్గురు ఇంజనీర్లు. ఇక త్వరలోనే 101 వెరైటీ ఛాయ్ రకాలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందరూ చిన్న చూపు చూసే ఒక చిన్న టీ స్టాల్ ఐడియా.. ముగ్గురు యువకుల జీవితాలను ఎలా మార్చిందో తెలిసింది కదా. ఆలోచన, సంకల్పం, ఆచరణ తోడైతే ఎవరైనా.. ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనడానికి ఈ ‘బీటెక్ ఛాయ్ వాలా’ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరి ఈ సక్సెస్ ఫుల్ ‘బీటెక్ ఛాయ్’ వాలా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.