జూలై 1 న నిర్వహించబోయే గ్రూప్ 4 పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను టిఎస్ పిఎస్ సి ఇప్పటికే పూర్తి చేసింది. ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కమిషన్ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.
తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా టిఎస్ పిఎస్ సి పలు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని యువత అహర్నిషలు శ్రమిస్తోంది. నోటిఫికేషన్ లు విడుదలైన నాటి నుంచి ఉద్యోగార్థులు ప్రిపరేషన్ లో మునిగిపోయారు. గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్ -4 ఇంకా ఇతర నోటిఫికేషన్లు టిఎస్ పిఎస్ సి నుంచి విడుదలైన నేపథ్యంలో భారీ సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో జరుగనున్న ఈ పరీక్షలకు నిరుద్యోగులు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో గ్రూప్ -4 పరీక్షను జూలై 01న టిఎస్ పిఎస్ సి నిర్వహించనున్నది. ఇప్పటికే గ్రూప్ -4 కు సంబంధించిన హాల్ టికెట్లను టిఎస్ పిఎస్ సి వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ సందర్భంగా గ్రూప్ -4 అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది టిఎస్ పిఎస్ సి.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 పరీక్షకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏ విధమైన అవకతవకలు, తప్పిదాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది. అభ్యర్థులు టిఎస్ పిఎస్ సి వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత వారి వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని తెలిపింది. అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్, పేరు, జెండర్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు సరి చూసుకోవాలని సూచించింది.
పరీక్ష కేంద్రానికి వెళ్లేటపుడు హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు అవి ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, వంటి ఒరిజినల్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని అభ్యర్థులు వెంట తీసుకెళ్లాలని సూచించింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను, పర్స్, వంటివి తీసుకెల్లరాదని సూచించింది. బూట్లు ధరించి రావద్దని అభ్యర్థులకు సూచించింది. ఎవరైనా టిఎస్ పిఎస్ సి నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని గేట్ క్లోజ్ చేసిన తర్వాత లోపలికి అనుమతించరని తెలిపింది. కాబట్టి అభ్యర్థులు ఈ సూచనలను పాటించి పరీక్షకు హాజరవ్వాలని టిఎస్ పిఎస్ సి సూచించింది.