తెలంగాణలో చేపట్టిన ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తాజాగా TSPSC చేపట్టిన గ్రూప్-4 నియామకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రూప్-4 దరఖాస్తులకు జనవరి 30 చివరి రోజు అని టీఎస్ పీఎస్సీ ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఉద్యోగార్థుల నుంచి వస్తోన్న భారీ స్పందన నేపథ్యంలో ఈ జనవరి 30 తో ముగిసిన లాస్ట్ డేట్ ను ఫిబ్రవరి 3 వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది TSPSC.మరిన్ని వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 8,180 ప్రభుత్వ ఉద్యోగాలకు TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్-4 ఉద్యోగాలలో భాగంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనవరి 30తో గ్రూప్-4 దరఖాస్తులకు గడువు ముగిసింది. దాంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను వెల్లడించారు అధికారులు. 8,180 పోస్టులకు గాను ఇప్పటి వరకు 8,47,277 మంది అప్లై చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చివరి రోజైన సోమవారం ఒక్కరోజే 34,247 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఈ ఉద్యోగాలకు భారీ స్పందన వస్తుండటంతో.. సర్వర్ లపై తీవ్ర ఒత్తిడి పడింది. దాంతో సాంకేతికంగా సమస్యలు ఏర్పాడ్డాయన్నారు అధికారులు. ఈ సమస్యను పరిగణంలోకి తీసుకుని దరఖాస్తు స్వీకరణ గడువును పెంచుతున్నట్లు TSPSC ప్రకటించింది. దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ కమిషన్ ప్రకటించింది. దాంతో అప్లై చెయ్యని వారికి ఓ అవకాశం కల్పించినట్లు అయ్యింది. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. అయితే తొలుత 9,168 పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రకటించిన కమిషన్.. తర్వాత ఆ పోస్టులను 8,180 పోస్టులకు తగ్గించింది.