కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేయాలనుకుంటున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. మునుపటి నోటిఫికేషన్ కు సవరణలు చేస్తూ ఖాళీల భర్తీని భారీగా పెంచింది. ఇది నిరుద్యోగులకు సువర్ణావకాశమనే చెప్పాలి.
మీరు కేంద్ర సాయుధ, రక్షణ బలగాల ఉద్యోగాల కోసం అప్లై చేశారా..? పరీక్ష రాశారా..? ఐతే ఇది మీకు శుభవార్తే. కేంద్ర సాయుధ, రక్షణ బలగాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్/రైఫిల్‌మ్యాన్/సిపాయి పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఖాళీల వివరాల్లో రెండు సార్లు మార్పులు చేసిన కమిషన్, మరోమారు పోస్టుల సంఖ్యను భారీగా పెంచడం గమనార్హం. మొత్తం 50,187 ఖాళీలున్నట్లు ఎస్‌ఎస్‌సీ పేర్కొంది.
గతేడాది అక్టోబర్ లో మొత్తం 24,369 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్) పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ విదితమే. ఆ తర్వాత గతేడాది నవంబర్‌లో ఆ పోస్టుల సంఖ్యను 45,284కు పెంచుతూ నిర్ణయం కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి సవరణ చేస్తూ 1,151 ఉద్యోగ ఖాళీలను కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 46,435కి పెరిగింది. తాజాగా ఐటీబీపీ విభాగంలో సిబ్బంది నియామకానికి మరో 3,257 పోస్టులను కలపడంతో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య 50,187కు పెరిగినట్టు ఎస్‌ఎస్‌సీ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్(జీడీ) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీ ఈ ఏడాది జనవరిలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఫిబ్రవరి 18న విడుదల చేసింది. ఈ కీపై అభ్యంతరాలను ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించారు. ఇక తుది కీ వెలువడాల్సి ఉంది. అనంతరం ఫలితాలు వెల్లడించాక శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.