లక్షల్లో జీతము, ఏసీ గదుల్లో పని, వారానికి రెండు రోజుల సెలవులు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఉన్న వెసులుబాట్లు ఇవి. సగటు మనిషి హాయిగా జీవించడానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అందుకే ఉద్యోగం అంటే సాఫ్ట్‌వేర్, దానికి మించింది లేదు అనే భావన అందరిలోనూ ఉంటుంది. అయితే.. అలా సంతోషంగా గడపాలన్నా సక్రమైన మార్గంలో నడవాలి. కాదని అడ్డదారి తొక్కితే సగంలోనే ఆ కళలు ఆవిరైపోతాయి. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో జరుగుతున్నదిదే. ఇన్నాళ్లు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఉద్యోగాల్లో చేరిన వారిని చూసి చూడనట్లు వదిలేసిన కంపెనీలు ఇప్పుడు రూటు మార్చాయి. పట్టుబడితే ఉద్యోగం పీకేయడమే కాకుండా, మేం చెల్లించిన జీతాలు కూడా తిరిగి చెల్లించాలని హుకూం జారీ చేస్తున్నాయట. మరి అలాంటి ఉద్యోగులను కంపెనీలు ఎలా గుర్తిస్తున్నాయన్నది ఇప్పుడు చూద్దాం..
లక్షలు లక్షలు డబ్బులు పట్టి ఫేక్ సర్టిఫికేట్లు పొందడం.. ఉద్యోగాన్ని దక్కించుకోవడం.. ఆరు నెలలు కూడా గడవకముందే ఆ ఉద్యోగాన్ని కోల్పోవడం. ఇది సదా మామూలే. ఇలాంటి వార్తలు మనం నిత్యం వింటూనే ఉంటాం. ఇన్నాళ్లు ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ఉద్యోగంలో చేరినా.. అదొక పెద్ద సమస్యగా ఉండేది కాదు. ఏదో ఒక సాఫ్ట్ వేర్ కోర్సు నేర్చుకొని.. ఏడాదో.. రెండేళ్లో.. గట్టిగా కష్టపడి జాబ్ లో స్థిరపడేవారు. అయితే ప్రస్తుతం అలా కనిపించట్లేదు. ఇన్నాళ్లు అలాంటి ఉద్యోగులను చూసి చూడనట్లు వదిలేసిన కంపెనీలు, ఇప్పుడు వారి ఏరివేత లక్ష్యంగా పనిచేస్తున్నాయి.
ఉద్యోగి ఇంతకుముందు పని చేశాడా! లేదా! అన్నది తెలుసుకోవడానికి ఆయా కంపెనీలు ‘బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్’ చేసేవి. అక్కడ అన్నీ ఓకే అంటే సరే. లేదంటే బయటకు పంపించేవి. అయితే కరోనా సమయంలో ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో అవసరం కాగా, వేగంగా నియామకాలు జరిగిపోయాయి. అదే సమయంలో లాక్‌డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోం అమల్లో ఉండడంతో.. జాబ్ సీకర్స్ సిస్టమ్స్‌లో టెక్నాలజీని వాడుకొని.. ఫేక్ రెజ్యూమ్స్, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి విపరీతంగా ఉద్యోగంలో చేరారు. ఈ విషయాన్ని అప్పట్లో పట్టించుకోని కంపెనీలు, కరోనా తగ్గుముఖం పట్టాక బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో అలాంటి ఉద్యోగులు దొరికిపోతున్నారు. ఈ సంఖ్య.. పదులు.. వందల్లో కాదు.. వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి సాఫ్ట్ రంగంలో కనిపిస్తోంది.