జాబ్ చేయకున్నా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ పొందవచ్చునని మీకు తెలుసా? అలా అని ఫేక్ సర్టిఫికెట్ కాదు. జెన్యూన్ గా ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్. మరి ఈ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
అప్పుడే చదువు పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే.. అనుభవం ఉందా అని అడుగుతారు. ముందు ఉద్యోగం ఇవ్వండి, అప్పుడు అనుభవం వస్తుంది అని నిరుద్యోగులు అంటారు. అదేం కుదరదు, బయలుదేరు.. అనుభవం ఉన్నవారికే ఉద్యోగం ఇస్తాం అని అంటారు. అనుభవం లేకపోతే ఉద్యోగం ఇవ్వరు, ఉద్యోగం చేయకపోతే అనుభవం రాదు. దీంతో దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం.. నేషనల్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ స్కీం (నాట్స్) పేరుతో ఒక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లోమా పూర్తి చేసిన వారెవరైనా సరే ఈ పథకంలో చేరి శిక్షణ పొందవచ్చు. ఆ తర్వాత నాట్స్ ఇచ్చే సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందవచ్చు.
శిక్షణ పూర్తయ్యాక వచ్చిన సర్టిఫికెట్ తో మీరుండే ప్రాంతంలో ఉపాధి కేంద్రాల్లో నమోదు చేసుకుంటే దాన్నే అనుభవంగా పరిగణిస్తారు. స్కాలర్ షిప్ ల మీద చదువుకున్న వారు కొందరు, వేలకు వేలు, లక్షలకు లక్షలు ఫీజులు కట్టి చదువుకున్నవారు కొందరు.. ఇలా ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లోమా చదువులు చదివిన వారు ఉద్యోగావకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నాట్స్ పరిష్కారం అని చెప్పవచ్చు. ఈ పథకంలో చేరిన యువతకు ఏడాది కాలం పాటు స్టైపెండ్ ఇవ్వడమే గాక.. అత్యున్నత మౌలిక సదుపాయాలు ఉన్న పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో 126 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. నాట్స్ లో చేరిన విద్యార్థులకు తాము చదివిన రంగానికి సంబంధించిన దాంట్లో శిక్షణ ఇస్తారు లేదా చదివిన రంగంతో సంబంధం లేకుండా నచ్చిన రంగంలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యేసరికి నిరుద్యోగ దశ ఉద్యోగ దశకు పరిణామం చెందుతారు. అంతలా శిక్షణ ఇస్తారు. వివిధ సంస్థలు, కంపెనీల్లో ఉద్యోగాలకు తగ్గట్టు మెళకువలు నేర్పుతారు. ఇప్పటి వరకూ 12,338 పరిశ్రమల్లో 19 లక్షల 57 వేల 553 మంది శిక్షణ పొందారు.