భారతీయ రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని.. ఒక్క భద్రత విభాగంలోనే 1.78 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని రైల్వే సంస్థ వెల్లడించింది.
ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సిబ్బంది ఎక్కువగా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్న అభిప్రాయాలను కొంతమంది వెలిబుచ్చారు. ఈ క్రమంలో ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద రైల్వేలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానిపై రైల్వే సంస్థను ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ కి చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే సామాజిక కార్యకర్త.. రైట్ టు ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ) యాక్ట్ కింద ఇండియన్ రైల్వేస్ ని ప్రశ్నించగా రైల్వే సంస్థ సమాధానం ఇచ్చింది. గ్రూప్ సీ కేటగిరీలో 2,74,580 ఖాళీలు ఉన్నాయని.. ఒక్క భద్రతా విభాగంలోనే 1.78 లక్షల ఖాళీలు ఉన్నాయని భారతీయ రైల్వే తెలిపింది. 2023 జూన్ నాటికి 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని భారతీయ రైల్వే పేర్కొంది.
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రకారం.. చంద్రశేఖర్ అనే ఆర్టీఐ యాక్టివిస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎన్ని ఖాళీలు ఉన్నాయని దాఖలు చేయగా ఇండియన్ రైల్వేస్ సమాధానమిచ్చింది. గ్రూప్ సీ కేటగిరీలో లెవల్ 1 సహా మొత్తం 2 లక్షల 74 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఒక్క భద్రతా విభాగంలోనే 1,78,00 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. జూన్ 01 2023 నాటికి 2,74,580 నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. భద్రతా విభాగంలో 9.82 లక్షల కంటే ఎక్కువ పోస్టులు ఉండగా వీటిలో 8.04 లక్షలు భర్తీ అయ్యాయని తెలిపింది. ఇంకా 1.78 లక్షల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని తెలిపింది.
2022 డిసెంబర్ లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. ఇండియన్ రైల్వేస్ లో 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ కు తెలియజేశారు. వీటిలో ముఖ్యంగా భద్రత విభాగంలో లోకో పైలట్లు, ట్రాక్ పర్సన్స్, పాయింట్స్ మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్ మరియు టెలికాం అసిస్టెంట్లు, గార్డులు/ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, క్లర్క్స్, టికెట్ కలెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమైన పోస్టులకు సంబంధించి సిబ్బంది కొరత ఉందని రైల్వే యూనియన్లు ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నారు. ట్రాక్ మెయింటెనెన్స్, ఫిట్ నెస్, సీనియర్, జూనియర్ సెక్షన్ ఇంజనీర్లు, గ్యాంగ్ మెన్, టెక్నీషియన్లు వంటి పోస్టుల కోసం రైల్వే యూనియన్లు మంత్రిత్వ శాఖను కోరాయి. ఈ సిబ్బంది కొరత కారణంగా పని ఒత్తిడి ఉన్న కార్మికులపై పడుతుందని.. ఒక్కో సిబ్బంది పట్టాలను తనిఖీ చేయడానికి 8 నుంచి 10 కి.మీ. నడుస్తున్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సమస్యను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పరిష్కరించేందుకు రైల్వే సంస్థ ప్రయత్నిస్తోంది. త్వరలోనే 2.74 లక్షల ఖాళీలను భర్తీ చేయనుంది.
RTI query finds around 2.74 lakh railway posts, including 1.7 lakh in safety category, vacant as of June 2023; Railways says addressing issue through recruitment, promotions, and moving non-core staff to core jobs
— Press Trust of India (@PTI_News) June 28, 2023