నెలకు ఓ 40, 50 వేలు జీతం వచ్చే ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా కోర్సు చేయాలి. కోర్స్ చేస్తే ఉద్యోగం వస్తుందో లేదో పక్కనబెడితే కోర్సు నేర్చుకుంటూ కూడా స్టైపెండ్ పొందే అవకాశం ఎవరైనా ఇస్తారా? ఏడాది కోర్సులో 6 నెలల పాటు పాతిక వేల స్టైపెండ్ ఎవరిస్తారు. ఈ అవకాశం హెచ్డీఎఫ్సీ ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రాం కల్పిస్తోంది.
డిగ్రీ, ఇంజనీరింగ్ చదివిన వారికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఏడాది పాటు కోర్సు నేర్పించి.. నెల నెలా స్టైపెండ్ ఇవ్వడమే కాకుండా కోర్సు పూర్తయ్యాక గ్యారంటీ జాబ్ ఇస్తుంది. డిగ్రీ, ఇంజనీరింగ్ పాసైన వారిని బ్యాంకింగ్ నిపుణులుగా మార్చేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ‘ఫ్యూచర్ బ్యాంకర్స్ 2.O’ పేరుతో ప్రత్యేక రిక్రూట్మెంట్ ప్రోగ్రాంని ప్రవేశపెట్టింది. మణిపాల్ గ్లోబల్ అకాడమీలోని బీఎఫ్ఎస్ తో కలిసి నియామకాలు చేపడుతోంది. దీని కోసం ఏడాది కాలపరిమితితో ప్రొఫెషనల్ డిప్లోమా కోర్సుని ప్రవేశపెట్టింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ. 5.59 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది.
కోర్సు ఫీజు కోసం లోన్ కూడా బ్యాంకే ఇస్తుంది. అయితే ఏడాది పాటు బ్యాంకు లోన్ కట్టాల్సిన పని లేకుండా మోరటోరియం పీరియడ్ ని కల్పిస్తుంది. కోర్సు పీరియడ్ 12 నెలలు ఉంటుంది. 4 నెలల పాటు ఫుల్ టైం రెసిడెన్షియల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చేత హాస్టల్ సదుపాయం ఉంటుంది. 2 నెలలు ఇంటర్న్ షిప్, 6 నెలలు ఏదైనా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శాఖలో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఏడాది కోర్సు పూర్తి చేసిన వారికి మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి సేల్స్ & రిలేషన్ షిప్ బ్యాంకింగ్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లోమా సర్టిఫికెట్ వస్తుంది.
అర్హతలు: 01/03/2023 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన తత్సమాన అర్హత కలిగి ఉండాలి. 50 లేదా అంతకంటే ఎక్కువ శాతం ఉండాలి.
వయసు పరిమితి: 21 నుంచి 28 ఏళ్ళు ఉండాలి.
రెండు టర్మ్స్ లో కోర్స్ అనేది ఉంటుంది. మొదటి టర్మ్ లో బ్యాంకింగ్ అండ్ అకౌంటింగ్స్ మీద బేసిక్స్, బిజినెస్ కమ్యూనికేషన్, సేల్స్ అండ్ సర్వీస్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ఆపరేషన్స్ నేర్పిస్తారు. రెండవ టర్మ్ లో ఆర్బీబీ 1 లయబిలిటీ ప్రొడక్ట్స్, ఆర్బీబీ 2 అసెట్ ప్రొడక్ట్స్, ఆర్బీబీ 3 అలైడ్ అండ్ క్రాస్ సెల్ ప్రొడక్ట్స్, డిజిటల్ బ్యాంకింగ్, ప్రీమియర్ బ్యాంకింగ్ ప్రోగ్రాం-పర్సనల్ బ్యాంకర్ నేర్పిస్తారు. మొత్తంగా ఏడాదిలో మిమ్మల్ని బ్యాంకింగ్ నిపుణులుగా తీర్చిదిద్దుతారు. కోర్సు ఫీజు 2.57 లక్షలు + పన్నులు ఉంటాయి. అయితే ఈ కోర్సు ఫీజులోనే 4 నెలల హాస్టల్ సదుపాయం ఉంటుంది.