పదవ తరగతి పాసయ్యారా? అయితే ఈ ఉద్యోగం మీ కోసమే. సీఆర్పీఎఫ్ తాజాగా లక్షా 30వేల పోస్టుల భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. మీరు పదవ తరగతి పాసైతే చాలు. సీఆర్పీఎఫ్ తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. లక్షా 30 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో లెవల్ 3 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా హోం మంత్రిత్వ శాఖ భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1,29,929 పోస్టులు భర్తీ చేయనుండగా.. వీటిలో 1,25,262 పోస్టులు పురుషులకు, 4,467 పోస్టులు మహిళలకు కేటాయించారు. మిగతా పోస్టులను మాజీ అగ్నివీరులకు కేటాయిస్తారు. ఈ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పదవ తరగతి పాసై ఉండాలి. వయసు పరిమితి 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఇక ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపిక కోసం అభ్యర్థులకు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించి ఎంపిక చేస్తారు. ఎంపికైన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ రెండేళ్లు ఉంటుంది. జీతాల విషయానికొస్తే కానిస్టేబుల్ పోస్టుకి ఎంపికైన వారికి నెలకు రూ. 21,700/- నుంచి 69,100/- వరకూ చెల్లిస్తారు. దరఖాస్తు ప్రక్రియ తేదీలను హోం మంత్రిత్వ శాఖ ఇంకా ప్రకటించలేదు. అధికారికంగా పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కానిస్టేబుల్ భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయి. దరఖాస్తు ప్రారంభ తేదీ, దరఖాస్తు చివరి తేదీ, పరీక్ష ఫీజు, రాత పరీక్ష తేదీ వంటి అప్ డేట్స్ కోసం సీఆర్పీఎఫ్ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోగలరు.
Ministry of Home Affairs has issued a notification regarding recruitment for around 1.30 lakh posts of constables in CRPF pic.twitter.com/XgyaOzj9GL
— ANI (@ANI) April 6, 2023