ఐటీ సెక్టార్.. ఇప్పుడిప్పుడే కొవిడ్ పంజా నుంచి కోలుకుంటోంది. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు బాటలు వేస్తున్నాయి. అయితే ఇప్పుడు అన్ని దిగ్గజ ఐటీ కంపెనీలకు మూన్ లైటింగ్ సమస్యగా మారింది. అంటే ఒకే ఉద్యోగి రెండు కెంపెనీలకు పనిచేస్తూ ఉండటం. వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఒకే ఉద్యోగి రెండు కంపెనీలకు పనిచేస్తూ వచ్చారు. ఇటీవలి కాలంలోనే చాలా కంపెనీలు ఈ విషయాన్ని గుర్తించాయి. తర్వాత విప్రో కంపెనీ అయితే అలా చేస్తున్న ఉద్యోగులను సైతం ఫైర్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చాలా ఐటీ కంపెనీలు మూన్ లైటింగ్ విషయంలో రూట్ మార్చాయనే చెప్పాలి. మార్చేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మూన్ లైటింగ్ అంశానికి కేంద్రం సపోర్ట్ చేస్తోంది.
దేశంలో ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీలు వాటి రెండో త్రైమాసిక వివరాలను వెల్లడించనున్నాయి. ఇప్పటికే టీసీఎస్ కంపెనీ తమ క్యూ2ని విడుదల చేయగా.. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు వాటి రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. తమ క్యూ2లో టీసీఎస్ కంపెనీ మూన్‌లైటింగ్ అంశంపై కూడా స్పందించింది. తమ కంపెనీలో 6.16 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్వో మిలింద్ లక్కడ్ తెలిపారు. అలాంటి తమ సంస్థలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలపై స్పందించేందుకు అన్నీ కోణాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని వెల్లడించారు. మూన్‌లైటింగ్ అనేది తమ కంపెనీ సంస్కృతి, విలువలకు విరుద్ధమని తెలిపారు. అలా మూన్ లైటింగ్ కు పాల్పడుతున్న 300 మంది ఉద్యోగులను విప్రో తొలగించిందని.. కానీ, తాము మాత్రం ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఇతర కంపెనీలు తమ ఉద్యోగుల పట్ల భిన్నమైన ఉద్దేశాలతో ఉందని.. టీసీఎస్ తమ ఉద్యోగుల పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నట్లు వెల్లడించారు.
ఇంక ఈ మూన్ లైటింగ్ అంశం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చలకు దారి తీసిన విషయం తెలిసిందే. జాతీయ మీడియా సైతం ఈ మూన్ లైటింగ్ అంశంపై చాలా కథనాలు ప్రచురించాయి. విప్రో ఒకేసారి 300 మంది ఉద్యోగులను తొలగించడం, ఆ సంస్థ ఛైర్మన్ మూన్ లైటింగ్ అనైతికమని.. గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ హెచ్చరికల తర్వాత సెప్టెంబర్ 24న పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా సదస్సులో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆ సదస్సులో మాట్లాడుతూ ఐటీ ఉద్యోగుల మూన్ లైటింగ్ అంశాన్ని రాజీవ్ చంద్రశేఖర్ సమర్థించారు. ఒక టెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న ఉద్యోగులు అదే కంపెనీకి తమ జీవితాన్ని త్యాగం చేసే రోజులు పోయాయంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. ఉద్యోగులను తొలగించి ఇతర స్టార్టప్‌లలో పనిచేయకూడదని చెబుతున్న ఐటీ కంపెనీల ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నట్లు రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర మంత్రి స్పందనతో ఐటీ కంపెనీలు మూన్ లైటింగ్ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది.