రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ ఏడాది ఐపీఎల్లో రెచ్చిపోతున్నాడు. నీళ్లు తాగినంత సులువుగా సెంచరీ, హాఫ్ సెంచరీలు బాదేస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేసులో ఉన్న ఈ యంగ్ లెఫ్టాండర్ ఆటకు అందరూ ఫిదా అవుతున్నారు.
రాజస్థాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ లెఫ్టాంటెడ్ బ్యాట్స్‌మన్ విధ్వంసం సృష్టించాడు. 47 బాల్స్‌లో ఏకంగా 98 రన్స్ చేసి రాయల్స్‌కు బంపర్ విక్టరీని అందించాడు. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే విజయం తప్పనిసరిగా మారిన మ్యాచ్‌లో జైస్వాల్ చెలరేగి ఆడాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే కేకేఆర్ బౌలర్లను జైస్వాల్ ఏవిధంగా ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు. అతడికి సారథి సంజూ శాంసన్ (48) కూడా తోడవ్వడంతో కోల్‌కతా విసిరిన 150 రన్స్ టార్గెట్‌ను.. రాజస్థాన్ రాయల్స్ 13.1 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. అతడు కేవలం 13 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో వేగవంతమైన ఫిఫ్టీని తన పేరిట రాసుకున్నాడు.
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ విషయంలో కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్ (14 బాల్స్‌లో) పేరిట ఉన్న రికార్డును జైస్వాల్ బ్రేక్ చేశాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే 26 రన్స్ పిండుకున్నాడతను. కేకేఆర్ సారథి, పార్ట్ టైమ్ స్పిన్నర్ నితీష్ రానా వేసిన మొదటి ఓవర్లో రెండు సిక్సులు, మూడు ఫోర్లతో ప్రమాద సూచనలు పంపాడు. ఆ తర్వాత కూడా అదే హిట్టింగ్‌ను కొనసాగిస్తూ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. జైస్వాల్ వీరబాదుడును ఎలా అడ్డుకోవాలో తెలియక కోల్‌కతా బౌలర్లు చేతులెత్తేశారు. జైస్వాల్ బ్యాటింగ్‌పై బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రశంసల జల్లులు కురిపించారు. అతడి ఇన్నింగ్స్ సూపర్ అని.. ఫ్యూచర్లోనూ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని సూచించారు జై షా. దీంతో జైస్వాల్ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని నెటిజన్స్ సహా క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ సీజన్లో ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్ 575 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.