ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్‌కు ఎక్కువగా మ్యాచ్‌లు లేకపోవడంతో అన్ని జట్లు అలర్ట్ అవుతున్నాయి. ప్రతి మ్యాచ్‌ను చావోరేవో అనేలా తీసుకుంటున్నాయి. ఈ తరుణంలో సూర్య కుమార్ యాదవ్ తిరిగి పుంజుకోవడం ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి అంచె ముగిసింది. దాదాపు జట్లన్నీ తొమ్మిది నుంచి పది మ్యాచ్‌లు ఆడేశాయి. ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతోంది. దీంతో జట్లన్నీ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడంపై దృష్టి సారించాయి. టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న సమయంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ అందుకున్నాడు. అతడు గత నాలుగు మ్యాచుల్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. ఇది ముంబైకే కాదు టీమిండియాకు కూడా గుడ్ న్యూస్. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఐపీఎల్ పదహారో సీజన్ ఆరంభంలో కూడా పేలవంగా ఆడాడు సూర్య. అలాంటిది తిరిగి ఫామ్‌ను అందుకోవడం శుభపరిణామంగా చెప్పొచ్చు.
ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడించాలని బీసీసీఐ భావిస్తోందట. గతేడాది టీమిండియా తరఫున అద్భుతంగా రాణించిన సూర్య.. రంజీ ట్రోఫీలో కూడా సత్తా చాటాడు. దీంతో అతడికి టెస్టుల్లో ఎంట్రీకి ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ. బోర్డర్-గవాస్కర్ టోర్నమెంట్లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయపడటంతో అతడి స్థానంలో సూర్యకు ఆడే అవకాశం ఇచ్చింది. అయితే సూర్యకు ఒక ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అతడు కేవలం 8 రన్స్ మాత్రమే చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అయ్యర్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో సూర్యకు మళ్లీ ఛాన్స్ రాలేదు.
టెస్టుల తర్వాత ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సూర్య కుమార్ దారుణంగా ఆడాడు. వరుసగా మూడు మ్యాచుల్లో తొలి బాల్కే అవుటై.. చెత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు. అయితే బీసీసీఐ మాత్రం సూర్యపై నమ్మకం ఉంచాలని డిసైడ్ అయ్యిందట. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ తదితరులు గాయాలతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమయ్యారు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఐపీఎల్లో గాయపడటంతో ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో బలహీనపడిన మిడిలార్డర్‌ను సూర్యతో బలోపేతం చేయాలని బీసీసీఐ భావిస్తోందట. యూకే వీసా రెడీగా ఉంచుకోవాలని అతడికి చెప్పినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. సూర్యతో పాటు బ్యాకప్ బ్యాటర్లుగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి కుర్రాళ్లను ఇంగ్లండ్‌కు పంపాలని బీసీసీఐ ఆలోచిస్తోందని సమాచారం.