ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కి కొత్త సమస్య వచ్చి చేరింది. పేపర్ మీద బలంగా కనబడుతున్న రోహిత్ సేనకు.. పరాజయాలు పలకరిస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అని పరిశీలిస్తే ?
ప్రస్తుత ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. రెండు పరాజయాలతో టోర్నీని ప్రారంభించినా.. ఆ తర్వాత రెండు విజయాలతో మంచి ఊపు మీద కనిపించింది. ఇక గత చివరి మూడు మ్యాచులు తీసుకుంటే కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. ఇప్పటివరకు మొత్తం 7 మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 7 వ స్థానంలో నిలిచింది. ప్రపంచస్థాయి బ్యాటర్లు ఉన్నప్పటికీ ఈ పరాజయాలు ముంబై ఇండియన్స్ కి ఎందుకు పలకరిస్తున్నాయి? గతంలో ఇదే టీమ్ తో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ ఇప్పుడెందుకు విజయం కోసం కష్టపడుతుంది?
రోహిత్ శర్మ, కిషాన్ , సూర్య , తిలక్ వర్మ , టిం డేవిడ్ , గ్రీన్ ఇలా పేపర్ మీద చూసుకుంటే తిలక్ వర్మ మినహాయించి అందరూ అంతర్జాతీయ ఆటగాళ్లే. తిలక్ వర్మ కూడా మంచి బ్యాటరే అనే సంగతి గుర్తుంచుకోవాలి. అయినా ముంబై ఇండియన్స్ ఓడిపోతూనే ఉంది. దీనికి కారణం ఏంటని గమనిస్తే వారి డెత్ బౌలింగ్ అని అర్ధం అవుతుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ డెత్ బౌలింగ్ దారుణంగా ఉండడం గమనార్హం. ఈ కారణంగానే నిన్న గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఓడిపోయింది. టోర్నీ స్టార్టింగ్ నుంచి ఈ విషయంలో విఫలమవుతూ వస్తున్న రోహిత్ సేన గత రెండు మ్యాచుల్లో చెత్త ప్రదర్శన చేస్తుంది. అన్ని టీమ్ లతో పోల్చుకుంటే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ డెత్ ఓవర్లలో 12.45 ఎకానమీతో చివరి స్థానంలో ఉంది.ఇక గత రెండు మ్యాచుల్లో తీసుకుంటే పంజాబ్ మీద చివరి నాలుగు ఓవర్లలో 65, నిన్న గుజరాత్ మీద 70 పరుగులు సమర్పించుకుంది.
ఒకప్పుడు బూమ్రా , బౌల్ట్ లాంటి ప్లేయర్లతో పటిష్టంగా ముంబై ఇండియన్స్ ఉండేది. ఇప్పుడు వారు జట్టులో లేకపోగా.. ఆర్చర్ కూడా గాయంతో ప్రతి మ్యాచ్ ఆడలేకపోతున్నాడు. బెహన్డ్ర్ఫ్, మెరిడిత్ లాంటి పేసర్లు ఉన్నా.. వారు డెత్ ఓవర్లలో ప్రభావం చూపించలేరు. ఇక అర్జున్ టెండూల్కర్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకున్నప్పటినుండి మొదటి రెండు ఓవర్లకే పరిమితమవుతున్నాడు. గ్రీన్ కూడా ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఏ సమస్య ఇలాగే కొనసాగితే ముంబై జట్టుకి రానున్న మ్యాచుల్లో మరిన్ని ఓటములు ఎదురయ్యే అవకాశముంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.