Virat Kohli: ఐపీఎల్‌లో ఛోకర్స్‌గా ఆర్సీబీకి పేరుంది. ఆ ముద్రను తొలగించేందుకు కోహ్లీ దాదాపు దశాబ్దం పాటు ప్రయత్నించాడు. వర్క్ అవుట్ కాక.. కెప్టెన్సీ వదిలేసుకున్నాడు. రెండేళ్లుగా ఆర్సీబీ డుప్లెసిస్ కెప్టెన్సీలో ఆడుతున్నా.. పెద్దగా మార్పులేదు. అందుకు కారణం కోహ్లీ షాడో కెప్టెన్సీ..
ఐపీఎల్‌లో వేరేలెవెల్ క్రేజ్, భారీ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్ ఆర్సీబీ. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్క సారి కూడా కప్పు కొట్టలేదు. అయినా కూడా ఆ జట్టును క్రికెట్ అభిమానులు విపరీతంగా అభిమానిస్తుంటారు. అందుకు ప్రధాన కారణం ఆ టీమ్‌లో విరాట్ కోహ్లీ ఉండటం. కోహ్లీ అభిమనులంతా ఆర్సీబీ అభిమానులే. అందుకే ఆ జట్టుకు అంత ఫాలోయింగ్. దాదాపు దశాబ్దం ఏళ్ల పాటు ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ కప్పు అందించలేకపోయాడు. దానికి తోడు బ్యాటర్‌గా కూడా విఫలం అవుతున్న తరుణంలో.. కెప్టెన్సీ భారాన్ని దించేసుకునేందుకు 2021 ఐపీఎల్ మధ్యలోనే కెప్టెన్సీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్ 2022 నుంచి ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చాడు. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్‌ని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ కొత్త కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. 2022లో ప్లేఆఫ్స్ వరకు వెళ్లిన ఆర్సీబీ.. కప్పు మాత్రం కొట్టలేకపోయింది. కెప్టెన్ మారిన దరిద్రం మాత్రం పోలేదంటూ ఆర్సీబీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జరుగుతన్న 16వ ఐపీఎల్ సీజన్‌లోనూ ఆర్సీబీ పరిస్థితి అంత ఆశాజనంగా ఏం లేదు. ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ప్లేఆఫ్స్‌పై పెద్దగా ఆశలు లేవు. దీంతో మరోసారి ‘ఈ సాలా కప్ నమ్‌దే’ నినాదం అలాగే మిగిలిపోయేలా ఉంది. ఇదంతా.. కేవలం కోహ్లీ వల్లే జరుగుతుందని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆర్సీబీ జట్టులో కోహ్లీ ఒక షాడో కెప్టెన్‌లా వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. పేరుకే డుప్లెసిస్ కెప్టెన్‌గా ఉన్నాడని.. కానీ, ప్లేయింగ్ ఎలెవన్, మ్యాచ్‌లో నిర్ణయాలు మొత్తం కోహ్లీనే తీసుకుంటూ.. డుప్లెసిస్‌ను కీలు బొమ్మను చేస్తున్నాడంటూ ఆర్సీబీ అభిమానులే అంటున్నారు. అందులో నిజమెంతో ఇప్పుడు పరిశీలిద్దాం..
విరాట్ కోహ్లీ కంటే ముందు రాహుల్ ద్రావిడ్, కెవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే, డానియల్ వెట్టొరి ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించారు. కానీ.. పెద్దగా ఫలితం లేదు. వెట్టోరి తర్వాత ఆర్సీబీ కెప్టెన్‌గా నియమితుడైన కోహ్లీ.. అత్యధిక కాలం ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2016లో ఫైనల్ కూడా టీమ్‌ను తీసుకెళ్లాడు. కానీ.. ఆ కప్పు మాత్రం అందించలేకపోయాడు. 2021లో కెప్టెన్సీ వదిలేశాడు. కానీ, తన ఐడియాలను జట్టుపై రుద్దడం మాత్రం ఆపలేదు. ఎందుకంటే.. 2021లో ఆడిన ఆర్సీబీ జట్టుకు ఇప్పుడు ఆడుతున్న ఆర్సీబీ టీమ్‌కు పెద్దగా తేడా ఏం లేదు. చాలా జట్లు మంచి సీజన్ గడవ కుంటే వచ్చే సీజన్‌కు భారీ మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. అవసరమైతే మూడేళ్లకు ఒక సారి జరిగే మెగా వేలంలో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేస్తున్నాయి. కానీ, ఆర్సీబీ మాత్రం కోహ్లీ చెప్పిన టీమ్‌నే కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, సిరాజ్ వీళ్లంతా కోహ్లీ ఎంపికలే.. వీరిలో సిరాజ్ మెరుగైనప్పటికీ.. మిగతా ఇద్దరు జట్టుకు భారంగా మారారు.
ముఖ్యంగా హర్షల్ పటేల్ ప్రతి మ్యాచ్‌లోనూ 4 ఓవర్లలో మినిమ్ 40 పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయినా కూడా అతన్ని అన్ని మ్యాచ్‌ల్లో ఆడిస్తున్నారు. ఇక ఓపెనింగ్ స్థానం. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఓపెనర్‌గా ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు కెప్టెన్సీ లేకపోయినా.. అతను ఓపెనర్‌గా ఆడుతున్నాడు. అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓపెనర్‌గా కోహ్లీ సక్సెస్ అయినా.. మిడిల్డార్‌లో జట్టు దారుణంగా దెబ్బతింటోంది. అదే కోహ్లీ వన్‌డౌన్‌లో ఆడితే.. డుప్లెసిస్‌కు తోడు మరో యువ ఓపెనర్ జట్టులో ఉంటే.. పవర్ ప్లేలో పరుగులు చేయడం పెద్ద విషయం కాదు. మంచి ఎటాకింగ్ ప్లేయర్ ఉండి, తొలి 6 ఓవర్లలో దడదడలాడి అవుటైనా.. మిగతా పని కోహ్లీ చూసుకునే అవకాశం ఉంది. మిడిల్ ఓవర్స్‌లో కోహ్లీ ఆడినంత బాగా మరే బ్యాటర్ ఆడలేడు. అలాంటి బ్యాటర్ ఓపెనర్‌గా ఆడుతుండటంతో జట్టు బలహీన పడింది. కోహ్లీ-డుప్లెసిస్ ఇద్దరూ ఆడితే ఓకే.. ఏ ఒక్కరు ఫెయిల్ అయినా ఆ ప్రభావం ఇతర బ్యాటర్లపై పడుతుంది. దీన్ని కోహ్లీ గమనించడం లేదు. కెప్టెన్‌గా డుప్లెసిస్ గమనించినా.. కోహ్లీని ఓపెనర్‌గా వద్దనే చెప్పే ధైర్యం చేయకపోవచ్చు.
అలాగే ఫేడ్ అవుటైన దినేష్ కార్తీక్ స్థానంలోనూ మరో యువ వికెట్ కీపర్‌ను ఆర్సీబీ పట్టుకోవడంలో విఫలమైంది. జట్టులో మ్యాక్స్‌వెల్ ఉన్నా.. అది కూడా కోహ్లీ ప్లానే.. కోహ్లీ కెప్టెన్ అయినప్పటి నుంచి జట్టులో మిడిల్‌లో ఒక స్టార్ బ్యాటర్ ఉంటున్నాడు. డివిలియర్స్, వాట్సన్.. ఇప్పుడు మ్యాక్స్‌వెల్. ఇది కూడా కోహ్లీ ఐడియాలజీనే. దీన్ని కూడా ఆర్సీబీ కెప్టెన్ కానీ, మేనేజ్‌మెంట్ కానీ మార్చలేకపోతుంది. ఇలా కోహ్లీ కెప్టెన్‌గా కాకపోయినా.. అన్‌అఫిషీయల్ కెప్టెన్‌గా తన ప్లాన్లనే వర్క్ అవుట్ చేస్తున్నాడు. కెప్టెన్‌గా 9 ఏళ్లకు పైనే చేసినా.. ఫలితం లేదని కెప్టెన్సీ వదిలేసిన తర్వాత కూడా కోహ్లీ తన మాట నడిపిస్తుండటంతో ఆర్సీబీలో పెద్దగా మార్పు కనిపించడంలేదని అభిమానులు అంటున్నారు. డుప్లెసిస్‌ని నామ్‌కే వాస్తే కెప్టెన్‌గా చేసి.. కోహ్లీ తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇలా అయితే ఆర్సీబీ తల రాత ఎలా మారుతుందని ఆర్సీబీ అభిమానులే అంటున్నారు. కాగా.. ఆర్సీబీకి తాను కెప్టెన్ కాకపోయినా.. ఏ విషయమైన, ఏ అభిప్రాయమైనా డుప్లెసిస్‌తో చెప్పే చనువు తనకు ఉందని, దాన్ని డుప్లెసిస్ కూడా అమలు చేస్తాడని ఇటివల కోహ్లీ చేసిన వ్యాఖ్యలు కూడా.. కోహ్లీ షాడో కెప్టెన్సీకి బలం చేకూర్చేలా ఉన్నాయి. మరి ఆర్సీబీకి కోహ్లీ షాడో కెప్టెన్‌లా వ్యవహరిస్తున్నాడా? అందుకే ఆర్సీబీ ప్రదర్శనలో పెద్దగా మార్పులేదా? అనే విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Royal Challengers Bangalore depend only on these four players. Virat Kohli,Faf Du Plessis,Glean Maxwell and Mohd Siraj.#RCBvsCSK . #CSKVSRCB pic.twitter.com/NNTb4X4WfU
— Usman Shaikh (@shaikhusman_7) April 17, 2023