ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి సత్తా చాటాడు. సన్‌రైజర్స్‌పై సెంచరీతో తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించాడు. అయితే కోహ్లీ హండ్రెడ్ వెనుక ఒక సీక్రెట్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఐపీఎల్ పదహారో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. టీమ్ సారథి ఫాఫ్ డుప్లెసిస్‌తో కలసి ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నాడు. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనైతే ఆకాశమే హద్దుగా విజృంభించి ఆడాడు విరాట్. 63 బాల్స్‌లో 100 రన్స్ చేసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలకమైన మ్యాచ్‌లో ఛేజింగ్ చేస్తూ హండ్రెడ్ కొట్టి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. 12 ఫోర్లు, 4 సిక్సులతో సన్‌రైజర్స్ బౌలర్లను చితగ్గొట్టాడు. అతడితో పాటు సారథి ఫాఫ్ డుప్లెసిస్ (71) కూడా రాణించడంతో ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 186 రన్స్ టార్గెట్‌ను మరో 4 బాల్స్ ఉండగానే ఆర్సీబీ ఛేదించింది. ఎస్ఆర్హెచ్పై గెలుపుతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది బెంగళూరు.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు రెండ్రోజుల ముందు ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాడు కోహ్లీ. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో సిరాజ్ నూతనంగా కట్టుకున్న ఇంటిని విరాట్‌తో పాటు డుప్లెసిస్, కేదార్ జాదవ్, వేన్ పార్నెల్తో సహా మరికొందరు ఆర్సీబీ ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ సందర్శించారు. సిరాజ్ ఇంట్లో ఇచ్చిన విందును వీళ్లు ఆరగించారు. కొన్ని గంటల పాటు వీళ్లంతా అక్కడే గడిపారు. గతంలో పాతబస్తీలో ఉండే సిరాజ్ కుటంబం.. ఈ మధ్య జూబ్లీహిల్స్‌లో కట్టుకున్న కొత్త ఇంటికి షిఫ్ట్ అయింది. ఈ ఫంక్షన్ తర్వాత రెండ్రోజులకు ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో కోహ్లీ సెంచరీ బాదాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ ఇంట్లో విరాట్ భోజనం చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సిరాజ్ ఇచ్చిన విందులో తినడం వల్లే కోహ్లీ అద్భుతంగా ఆడాడని ఫ్యాన్స్ అంటున్నారు. ‘సిరాజ్.. ఏం కలిపి పెట్టావ్, హైదరాబాద్ ఫుడ్ తింటే చాలు కోహ్లీకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది’ అంటూ అభిమానులు ఈ ఫొటోలపై కామెంట్లు పెడుతున్నారు.