Virat Kohli: ఇండియన్ క్రికెట్‌కు సచిన్ దేవుడు.. మరి సచిన్ తర్వాత ఎవరంటే చాలా మంది చెప్పే మాట కోహ్లీ. కానీ.. అది ఆట పరంగా మాత్రమే.. అంటున్నారు కొంతమంది. మరి పూర్తిగా సచిన్ అంతటోడు అవ్వడానికి కోహ్లీ ఏం చేయాలి.
విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్‌లోనే కాదు ప్రపంచ క్రికెట్‌లోనే ఓ గొప్ప ఆటగాడు. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండూల్కర్ తర్వాత ఎవరంటే వినిపించే పేరు విరాట్ కోహ్లీ. ఇప్పటికే ఎంతో సాధించాడు. సచిన్‌ను మించిన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆటలో ప్రతి చిన్న విషయంలో సచిన్‌తోనే కోహ్లీని పోలుస్తుంటారు. అసలు క్రికెట్‌లో సచిన్ లాంటి వాడు మళ్లీ పుడతాడా? అనే సందేహంలో ఉన్నప్పుడే, సచిన్ ఆటగాడిగా కొనసాగుతున్నప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లు.. ఇండియన్ క్రికెట్‌లో కింగులా ఎదిగాడు. ఆట విషయంలో సచిన్‌కి సమానమైన ఆటగాడిగా పేరుతెచ్చుకున్న కోహ్లీ.. గౌరవం పొందే విషయంలో మాత్రం వెనుకబడుతున్నాడు. కోహ్లీని చూసి చేతులెత్తి మొక్కాల్సిన యువ క్రికెటర్లు.. వేలెత్తి గొడవపడుతున్నారు. ప్లేయర్‌గా శిఖరాలకు చేరిన కోహ్లీ.. ప్రవర్తనలో మాత్రం పిల్ల బచ్చాలా మారి.. తన పరువును తానే తీసుకుంటున్నాడు.
క్రికెట్ ప్రపంచంలో ఒక వీవ్ రిచర్డ్స్, ఒక సచిన్.. ఆ తర్వాత ఎవరంటే కోహ్లీనే అని చాలా మంది క్రికెట్ అభిమానులు ఒప్పుకుంటారు. అలాంటి ఇమేజ్ ఉన్న ఆటగాడు యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలవాలికానీ, వాళ్లకి శత్రువులా మారకూడదు. యువ క్రికెటర్లు తప్పు చేస్తే.. పెద్ద మనుసుతో క్షమించాలి కానీ, వారితో సమానంగా పిల్ల చేష్టలకు దిగకూడదు. అది స్థాయిని తగ్గిస్తుంది. ప్రస్తుతం కోహ్లీ చేస్తున్న అతి పెద్ద తప్పు ఇదే. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ అంటే ఒక లెజెండ్. ఆటలో అతనికి పోటీ ఇచ్చే వాళ్లు లేరు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎంతో చేశాడు. కోహ్లీ చూసి ప్రస్తుతం ఉన్న చాలా మంది యువ క్రికెటర్లు ఇన్స్‌పైర్ అవుతుంటారు. కోహ్లీని ఆదర్శంగా తీసుకుంటారు. కోహ్లీలా ఆడాలని, కోహ్లీతో ఆడాలని కలలు కనే క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వేరే దేశాలకు ఆడే క్రికెటర్లలో కూడా కోహ్లీకి అభిమానులు ఉన్నారు. అది కోహ్లీ రేంజ్.
అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టాప్‌లో ఉన్న టైమ్‌లో సచిన్‌తో పోటీ పడిన క్రికెటర్లు కూడా ఉన్నారు. పాంటింగ్, లారా, జయసూర్య, గంగూలీ.. ఇలాంటి ఆటగాళ్లు ఒకానొక సీజన్‌లో సచిన్ కంటే మించి ఆడిన వాళ్లే.. అయినా కూడా సచిన్ క్రికెట్‌కి దేవుడిగా ఎదిగాడు. అందుకు కారణం.. సచిన్ ఆట మాత్రమే అనుకుంటే పొరపాటు. సచిన్ దేవుడిగా ఎదిగేందుకు అతని ఆటతో పాటు అతని వ్యక్తిత్వం కూడా కారణం. 99 రన్స్ వద్ద అంపైర్ తప్పుడు నిర్ణయానికి అవుటైనా.. కామ్‌గా వెళ్లిపోయేవాడు సచిన్. ప్రత్యర్థి ఆటగాళ్లు కావాలని కవ్వించినా.. చిరు నవ్వుతోనో, హద్దు దాటి ప్రవర్తిస్తే బ్యాట్‌తోనో బదులిచ్చేవాడు కానీ, నోటికి.. మాటకి పనిచేప్పేవాడు కాదు. ఆటలో సచిన్‌లా కనిపించే కోహ్లీ, ప్రవర్తనలో మాత్రం సచిన్‌లా కనిపించడం లేదు. అందుకే.. కోహ్లీకి ఉన్న స్థాయికి చేతులెత్తి మొక్కాల్సిన నవీన్ ఉల్ హక్ లాంటి యువ క్రికెటర్లు కూడా గొడవకి దిగుతున్నారు.
ఆటలో అగ్రెసివ్‌నెస్ ఉంటుంది. అలా ఉండటం అందమే కానీ.. కోహ్లీ లాంటి వ్యక్తి ఇప్పుడో శిఖరం. దూకుడు స్వభావం అతని నైజమైనా.. ఆటలో యువ క్రికెటర్ల విషయంలో హుందాగా ఉండాలి. వాళ్లంటే అరాకొర మ్యాచ్‌లు ఆడిన వాళ్లు, ఉడుకు రక్తం, ఆవేశాలు ఉంటాయి. మరీ కోహ్లీ ఎన్ని చూశాడు, ఎన్ని దాటోచ్చాడు. అలాంటి వ్యక్తి ఓ టెయిలెండర్ వికెట్ పడితే వాళ్ల ముందుకు వెళ్లి అతిగా సెలబ్రేట్ చేసుకోవాలా? అది అతని స్థాయిని తగ్గించుకున్నట్లు కాదా? ఈ విషయంలో కోహ్లీ.. తనకు తానే ఆత్మ విమర్శ చేసుకోవాలి. అరె.. కోహ్లీ ఒక సలహా ఇస్తే చాలు మా తలరాతలు మారిపోతాయని ఎదురుచూసే బచ్చా క్రికెటర్లతోనా కోహ్లీ గొడవపడాల్సింది. వాళ్లే కావాలని కోహ్లీని కవ్వించినా.. చిన్న చిరునవ్వుతో వాళ్ల అహాన్ని అణిచివేసే స్థాయి కోహ్లీది. అలాంటి ఆటగాడు ఇలా చీటికీ మాటికీ చిన్న పిల్లలతో గొడవలకు దిగుతూ.. తన స్థాయిని తానే తగ్గించుకోవడం నిజంగా కోహ్లీని ఇష్టపడేవాళ్లకు అస్సలు నచ్చడం లేదు. ‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా..?’ కాదుగా.. ఈ మాటనే కోహ్లీ గుర్తుంచుకుని.. ఎవరి భాషలో వాళ్లకి సమాధానం చెప్పాలనే ధోరణని మార్చుకోవాలి. శిఖరం.. శిఖరంలానే ఉండాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
People Telling Gambhir Started all this
1. Virat Kohli Started Abusing Naveen & Senior Team India Player Amit Mishra onField
2. While Shaking Hands Once Again Kohli Misbehaved with Naveen
3. So GG have Authority to Intervene in this Things when his Players Are Not Treated Well pic.twitter.com/l86r0CqJSl— ash (@ashMSDIAN7) May 1, 2023