బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ ఫేవరెట్ క్రికెటర్‌ను దాదా కావాలని అవమానిస్తున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..
ఐపీఎల్ పదహారో సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటోంది. ఫైనల్స్‌కు ఒక బెర్త్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఖరారు చేసుకుంది. అయితే ఆ జట్టుతో లాస్ట్ ఫైట్‌లో తలపడే టీమ్ ఏదో ఇంకా తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్-2023లో ఆట కంటే కూడా కాంట్రవర్సీలు ఎక్కువగా ఆడియన్స్ అటెన్షన్ తీసుకున్నాయి. తొలుత విరాట్ కోహ్లీ-సారవ్ గంగూలీ వివాదం, ఆ తర్వాత కొన్ని రోజులకు గంభీర్-కోహ్లీ కాంట్రవర్సీలు ఐపీఎల్‌ను షేక్ చేశాయి. అయితే ఈ వివాదాలు ఇక ముగిశాయని అందరూ అనుకుంటున్నా.. కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పట్లో వీటిని వదిలేలా కనిపించడం లేరు. గంభీర్‌తో పాటు కోహ్లీని గెలికిన నవీన్ ఉల్ హక్ స్టేడియంలో కనిపించిన ప్రతిసారి వారిని రెచ్చగొడుతున్నారు విరాట్ అభిమానులు.
ఇప్పుడు గంగూలీని టార్గెట్‌గా చేసుకొని ట్రోలింగ్ చేస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్. దీనికో కారణం ఉంది. ఈ సీజన్ ఐపీఎల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిచింది. అయితే ఇరు జట్లలోని స్టార్ బ్యాటర్లు కోహ్లీ, శుబ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగారు. వరుస సెంచరీలతో అభిమానులకు మస్తు వినోదం పంచారు కోహ్లీ, గిల్. అయితే ఈ సెంచరీల మీద బీసీసీఐ మాజీ బాస్ గంగూలీ ట్వీట్ చేస్తూ.. ‘ఈ దేశం ఎంత ప్రతిభను ఉత్పత్తి చేస్తుందో చూడండి. శుబ్‌మన్ గిల్.. వావ్, టూ స్టన్నింగ్ నాక్స్ ఇన్ టూ హావ్స్. ఐపీఎల్.. ఈ టోర్నీలో ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయి అనే దానికి ఇదే నిదర్శనం’ అని చెప్పుకొచ్చాడు. దాదా చేసిన ఈ ట్వీట్ వివాదాస్పదంగా మారింది.
గంగూలీ గిల్‌నే మెచ్చుకున్నాడని, కోహ్లీని పట్టించుకోలేదని ఫ్యాన్స్ గరం అవుతున్నారు. దాదా తన ట్వీట్లో విరాట్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని వాళ్లు సీరియస్ అవుతున్నారు. కోహ్లీపై ఇంత వివక్ష ఎందుకంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే తనపై జరుగుతున్న ట్రోలింగ్ మీద గంగూలీ దీటుగా స్పందించాడు. తాను చేసిన ట్వీట్‌ను ఇష్టానుసారం అన్వయించుకుంటున్న వారు ముందుగా ఇంగ్లీషును అర్థం చేసుకోవాలన్నాడు. ఇంగ్లీషు రాకపోతే ఏమీ చేయలేనని.. తాను అనుకున్నది క్లియర్‌గా చెప్పానన్నాడు. దాదా తన ట్వీట్లో ‘టూ స్టన్నింగ్ నాక్స్ ఇన్ టూ హావ్స్’ అన్నాడు. దీనికి రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు అద్భుతమైన ప్రదర్శనలు అని అర్థం. రెండు సమాన కాలాల్లో ఒకే రకమైన ప్రదర్శన అనే అర్థం కూడా వస్తుంది. దీన్ని బట్టి ఈ మ్యాచ్‌లో గిల్‌తో పాటు బాగా ఆడిన విరాట్నూ దాదా మెచ్చుకున్నాడని చెప్పొచ్చు. గంగూలీ ఇంగ్లీషులో ఇంత మ్యాజిక్ ఉందా అని నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Just a quick reminder .. hope those of you twisting this tweet ,understand English .. if don’t please get someone responsible to explain ..
— Sourav Ganguly (@SGanguly99) May 23, 2023