ఈ ఐపీఎల్ సీజన్లో ఆటలో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. వివాదాలను పక్కనబెడితే.. ఒక విషయంలో కోహ్లీని నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. విరాట్.. ఇంట్లో మాత్రమే పులి అని, బయట పిల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 మ్యాచ్‌లు దాదాపుగా ఆఖరి దశకు చేరుకున్నాయి. ప్లేఆఫ్స్‌పై ఇప్పుడు జట్లన్నీ దృష్టి సారించాయి. ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. గెలుపే లక్ష్యంగా ఆయా జట్లు పథకాలు పన్నుతూ, వ్యూహ రచన చేస్తూ బిజీబిజీగా మారాయి. ప్లేఆఫ్స్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇవాళ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. ఇదే సమయంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ సీజన్లో కోహ్లీ రాణిస్తున్నప్పటికీ.. అతడి స్ట్రైక్ రేట్ మాత్రం ఆశించిన విధంగా లేదు. ఇన్నింగ్స్ ఆరంభంలో వేగంగా ఆడుతున్న విరాట్.. మిడిల్ ఓవర్లలో మాత్రం నెమ్మదిస్తున్నాడు.
మరోవైపు హోమ్ గ్రౌండ్లో, బయటి మైదానాల్లో కోహ్లీ స్ట్రైక్ రేట్‌ను పోలుస్తూ నెటిజన్స్ విశ్లేషిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా విరాట్ 6 మ్యాచ్‌లు సొంత మైదానంలో ఆడితే.. మరో 4 బయట ఆడాడు. హోమ్ గ్రౌండ్లో 149.70 స్ట్రైక్ రేట్‌తో 253 రన్స్ చేసిన రన్ మెషీన్.. బయటి మైదానాల్లో మాత్రం అంతగా రాణించట్లేదు. ప్రత్యర్థుల మైదానాల్లో విరాట్ ఇప్పటి వరకు 166 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ (117.73) కూడా తక్కువగా ఉంది. చిన్నస్వామి స్టేడియంలో 169 బాల్స్‌ను ఎదుర్కొని 10 సిక్సులు బాదిన అతడు.. బయటి స్టేడియాల్లో 141 బాల్స్‌లో ఒక్క సిక్స్ కొట్టాడు. దీంతో కోహ్లీ ఇంట్లో పులి, బయట పిల్లి అంటూ నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా విరాట్ ఆటతీరుపై స్పందించాడు. అతడు తన టెంపోను కొనసాగించాలని సూచించాడు.