ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. మైదానంలో లోపలే కాదు బయట కూడా వీళ్లు బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటి వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది.
ప్రతిసారి గండెపడాశలతో ఐపీఎల్‌ను ఆరంభించే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎప్పుడూ నిరాశే ఎదురవుతోంది. టోర్నీలో 16వ సీజన్ నడుస్తున్నా ఇప్పటికీ ఒక్కసారి కూడా కప్‌ను ముద్దాడలేదు ఆర్సీబీ. స్టార్ బ్యాటర్లు, భీకరమైన పేసర్లతో మైదానంలోకి దిగినా ఓటమి పాలవ్వడం ఆర్సీబీకి పరిపాటిగా మారింది. ఈసారి కూడా ఆ టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. కానీ 6 మ్యాచుల్లో మూడింట మాత్రమే గెలిచింది. గురువారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంపర్ విక్టరీ కొట్టింది. విజయాల పరంపరను అలాగే కొనసాగిస్తూ పోతే ఆర్సీబీని ఆపడం కష్టమే. బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్, హసరంగ అదరగొడుతున్నారు. బ్యాటింగ్‌లో సారథి ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీకి తోడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు.
ఇక, ఈ సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భీకరమైన ఫామ్‌లో ఉండటం వారికి కలిసొచ్చే అంశం. ఈ సీజన్లో 4 అర్ధ సెంచరీలు బాదిన విరాట్.. టాప్ బ్యాటర్ల లిస్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే టాప్ పొజిషన్లో ఉన్నది మరెవరో కాదు.. కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్, ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్. వీళ్లిద్దరూ చెలరేగుతుండటంతో ఆర్సీబీ భారీ స్కోర్లు చేస్తోంది. ఒకసారి డుప్లెసిస్ దూకుడుగా ఆడితే, మరోసారి విరాట్ ఆ బాధ్యతను తీసుకుంటున్నాడు. బ్యాటర్ల లిస్టులో టాప్ పొజిషన్ కోసం వీళ్లిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఈ సీజన్ ఐపీఎల్లో 300 రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా డుప్లెసిస్ ముందంజలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో 68 సగటుతో 343 రన్స్ చేశాడు ఫాఫ్. 166 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టిస్తున్న డుప్లెసిస్.. ఇప్పటికే ఏకంగా 23 సిక్సర్లు, 25 ఫోర్లు బాదడం విశేషం. ఏ జట్టు, ఏ బౌలర్ అనేది చూడకుండా చితగ్గొడుతున్నాడు. టాప్ పొజిషన్ కోసం విరాట్-డుప్లెసిస్ మధ్య పోటీ ఉండటం మంచిదే. వీళ్లిద్దరూ ఎంత పోటాపోటీగా రన్స్ చేస్తే ఆర్సీబీకి అంత ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఇద్దరు మిత్రుల పోటీలో వ్యక్తిగతంగా ఎవరి గెలిచినా.. చివరకు ఆర్సీబీకి ప్రయోజనం కలిగిందా లేదా అనేది ముఖ్యమని చెప్పొచ్చు.