అతడొక తెలుగు కుర్రాడు. పేరు తిలక్ వర్మ. గతేడాదే ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు కనీసం రెండు ఐపీఎల్ సీజన్లు కూడా పూర్తిగా ఆడకపోయినా.. దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డు ని తన పేరిట లిఖించుకున్నాడు.
ఐపీఎల్ లో బ్యాటర్లు చెలరేగడం మనకు తెలిసిందే. ఇక పవర్ ప్లేలో, చివరి ఓవర్లలో అయితే.. బ్యాటర్లు విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి 6 ఓవర్లలో సర్కిల్ బయట ఇద్దరే ఫీల్డర్లు ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. ఇక డెత్ ఓవర్లలో స్కోర్ వేగాన్ని పెంచేందుకు బౌలర్ల మీద విరుచుకుపడతారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మధ్య ఓవర్లో మ్యాచ్ కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. 7-15 ఓవర్ల మధ్యలో బ్యాటర్లు పరుగులు చేయడానికి బాగా శ్రమిస్తారు. కానీ మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మాత్రం మిడిల్ ఓవర్లు లో అదరగొట్టేస్తున్నాడు. ఏకంగా దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డ్ ని తిలక్ వర్మ నెలకొల్పాడు.
తిలక్ వర్మ ఐపీఎల్ డెబ్యూ 2022 లో జరిగింది. 1.7 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ ఈ తెలుగోడిని సొంతం చేసుకుంది. ముంబై జట్టులో స్టార్లు ఉన్న నేపథ్యంలో తుది జట్టులో స్థానం కష్టమని భావించారంతా. కానీ ప్రస్తుతం ముంబై టీమ్ లో అత్యంత నిలకడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఒక అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో 2022 నుంచి ఇప్పటివరకు మిడిల్ ఓవర్లు చూసుకుంటే.. తిలక్ వర్మ అందరి కంటే ఎక్కువగా పరుగులు చేయడం విశేషం. యావరేజ్ పరంగా చూసుకున్న అందరికంటే మనోడిదే పై చేయి. కోహ్లీ ,రోహిత్, రాహుల్ లాంటి ప్లేయర్లు ఉన్నా గత రెండేళ్లుగా తిలక్ వర్మ చూపించిన నిలకడ అద్భుతం.
మిడిల్ ఓవర్లలో(7-15) ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్ లు ఆడిన ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్ 393 పరుగులు చేసాడు. యావరేజ్ 49.1 గా ఉంది. ఇక తిలక్ వర్మ తరువాత స్థానంలో సంజు శాంసన్, బట్లర్, హార్దిక్ పాండ్య ఈ లిస్టులో వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత సీజన్ లో కూడా అదరగొడుతున్న తిలక్ వర్మ ఇలాగే ఆడితే త్వరలో భారత జట్టులోకి కూడా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనబడుతుంది. ఇటీవలే రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే.. తిలక్ త్వరలో ఇండియన్ టీమ్ లోకి వస్తాడని అర్ధమవుతుంది. మరి పరుగులు చేయడం కష్టంగా ఉండే మిడిల్ ఓవర్లలో తిలక్ వర్మ నుండి ఇలాంటి ప్రదర్శన రావడం.. మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.