ఐపీఎల్ లో 49 బంతుల్లో సెంచరీ కొట్టేసి మరో సారి తన ప్రతాపాన్ని చూపించాడు సూర్య కుమార్ యాదవ్. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం సూర్యకి కొత్తేమి కాకపోయినా చివరి నాలుగు ఓవర్లలో ఈ ముంబై బ్యాటర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.
సూర్య అంటే పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్. బిజినెస్ మ్యాన్ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పే డైలాగ్. అదేదో సినిమాలో డైలాగ్ అనుకున్నారు కానీ ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చూస్తుంటే ఆ డైలాగ్ నిజం అనిపిస్తుంది. సూర్య షాట్స్ ఆడే విధానం చూస్తుంటే ఈ స్టార్ బ్యాటర్ కోసమే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ డైలాగ్ రాసారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎవ్వరికీ సాధ్యం కానీ, క్రికెట్ పుస్తకాల్లో లేని షాట్స్ అలవోకగా ఆడేస్తున్నాడు. ఈ విధ్వంసకర వీరుడి గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమి లేకపోయినా .. ఐపీఎల్ లో నిన్న ఆడిన ఇన్నింగ్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఐపీఎల్ లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ 27 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొత్తంలో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ హైలెట్ గా నిలవడం విశేషం. 49 బంతుల్లో సెంచరీ కొట్టేసి మరో సారి తన ప్రతాపాన్ని చూపించాడు. సూర్యకి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం కొత్తేమి కాకపోయినా చివరి నాలుగు ఓవర్లలో ఈ ముంబై బ్యాటర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. 16 ఓవర్ ముగిసేసరికి సూర్య 47 పరుగులతో గ్రీజ్ లో ఉన్నాడు. ఈ దశలో పటిష్టమైన గుజరాత్ బౌలింగ్ ని ఎదుర్కొని సూర్య సెంచరీ చేస్తాడని ఎవరైనా ఊహిస్తారా! అస్సలు ఛాన్సే లేదు. కానీ సూర్య దీన్ని సుసాధ్యం చేసి చూపించాడు.
చివరి నాలుగు ఓవర్లలో సూర్య ఒక్కడే వ్యక్తిగతంగా 56 చేయడం విశేషం. ఇప్పటివరకు టీ 20 ల్లో ఈ తరహాలో ఆడడం ఎవ్వరిని చూసి ఉండరు. ఐపీఎల్ కి ముందు వరుస డకౌట్లు కావడం, ఆ తర్వాత ఐపీఎల్ ప్రారంభంలో కూడా పేలవ ఫామ్ కొనసాగించడం వలన సూర్య కుమార్ యాదవ్ ని అందరూ బ్యాటింగ్ మీద అందరు విమర్శలు చేశారు. అతని బ్యాటింగ్ లో పదును తగ్గిందని.. అతని ఇక రానించడం కష్టమని చెప్పుకొచ్చారు. కానీ ఈ ఐపీఎల్ లో సూర్య ఆడిన చివరి 6 ఇన్నింగ్స్ లు చూసుకుంటే ఇప్పుడు విమర్శించినా వారే వీడియో గేమ్ బ్యాటింగ్ లా ఉందని ఆకాశానికెత్తేస్తున్నారు.
కొంతమంది బ్యాటర్లు వచ్చిన దగ్గర నుంచి ఎటాకింగ్ చేసే పనిలో ఉంటారు. కానీ వీరు ప్రతి మ్యాచ్ ఆడలేరు. మరి కొందరైతే ఇన్నింగ్స్ నిలకడగా ఆడినా..అటాకింగ్ ఆడడంలో విఫలమవుతారు. ఈ రెండు కూడా ఆడియన్స్ కి నచ్చవు. కానీ సూర్య కుమార్ యాదవ్ వీరందరికీ భిన్నం. ఓ నిలకడ, మరోవైపు అటాకింగ్ చూపిస్తూ బ్యాటింగ్ ఆసాంతం అందరినీ ఎంటర్ టైన్ చేసే పనిలో ఉంటాడు. ఇలా బ్యాటింగ్ ఆడేవారు కూడా కొంతమంది ఉన్నప్పటికీ.. వారందరిలో సూర్యని స్పెషల్ గా ఉంచేది అతని షాట్ సెలెక్షన్. గ్రౌండ్ లో అన్ని వైపులా షాట్లు కొట్టగల సమర్ధుడు. స్వీప్, హుక్, ఫ్లిక్ షాట్లతో ముచ్చటగొలిపేలా ఉంటుంది సూర్య కుమార్ ఆట. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ లో స్వీప్ షాట్స్ ఆడడం అనేది సూర్యకి తెలిసినంత మరెవ్వరికీ తెలియదేమో అనిపిస్తుంది. ఇతని బ్యాటింగ్ చూస్తుంటే ఏదో గ్రహం నుంచి వచ్చి ఏలియన్ ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది. మరి రానున్న మ్యాచుల్లో సూర్య దూకుడు ఇలాగే కొనసాగితే ముంబై ఇండియన్స్ కి మరొక టైటిల్ ఖాయం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.