ఐపీఎల్ పదహారో సీజన్‌ను చెన్నై జట్టు ఓటమితో మొదలుపెట్టింది. అయితే.. ఈ మ్యాచ్‌లో సారథి ధోని బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. కానీ ధోనిలో మునపటి వేగం కనిపించడం లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అతడి ఫిట్‌నెస్‌పై సీఎస్కే కోచ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఐపీఎల్ పదహారో సీజన్లో తొలి మ్యాచులోనే బోణీ కొట్టాలనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ చతికిలపడింది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌తో చెన్నై సారథి ఎంఎస్ ధోని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 41 ఏళ్ల 267 రోజుల వయసులో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోని.. గతంలో షేన్ వార్న్ (41 ఏళ్ల 249 రోజుల వయసులో) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 15 ఏళ్ల కిందట తొలి ఐపీఎల్ టోర్నీ సందర్భంగా నిర్వహించిన ఫొటో షూట్లో ఉన్న ధోని.. తాజాగా 16వ సీజన్లోనూ ఉండటం విశేషం అనే చెప్పాలి. ఇకపోతే, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ హిట్టింగ్‌కు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. 7 బాల్స్‌లో 14 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన ధోని.. కీపింగ్‌లో మాత్రం మునుపటిలా దూకుడును ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. గుజరాత్ బ్యాటింగ్ సమయంలో దీపక్ చాహర్ వేసిన 19వ ఓవర్లో తెవాటియా ప్యాడ్లను తాకి లెగ్‌సైడ్‌కు వెళ్తున్న బాల్‌ను ఆపడంలో ధోని ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో అతడి కండరాలు పట్టేశాయి. దీంతో ఫ్యాన్స్‌లో కాస్త ఆందోళన రేగింది. కానీ, త్వరగానే సర్దుకున్న మాహీ కీపింగ్ బాధ్యతలను పూర్తి చేశాడు. అయితే ధోనిలో వేగం లోపించిందని కామెంట్స్ వినిపించాయి. వీటి మీద సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ఒకప్పటిలా దూకుడుగా ఉండటం ఇప్పుడు సాధ్యం కాదన్నాడు.
‘ధోని నిరంతరం క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అయితే, అతడిలో వేగం లేదనే కామెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఈ సీజన్ మొదలవ్వడానికి ముందు వరకు మోకాలి నొప్పితో బాధపడ్డాడు ధోని. కానీ, ఈ మ్యాచ్‌లో అతడి కాలు తిమ్మిరి ఎక్కింది. 15 ఏళ్ల కిందట ఎంత వేగంగా ఉన్నాడో ఇప్పుడు అంత వేగంగా ఉండలేడు. ధోని ఇప్పటికి కూడా గొప్ప నాయకుడు. బ్యాటింగ్‌లోనూ దూకుడు ప్రదర్శించాడు. తన పరిస్థితి మీద అతడికి పూర్తి అవగాహన ఉంది. గ్రౌండ్లో ధోని కీలకమైన ప్లేయర్. అతడో దిగ్గజ క్రికెటర్’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. ఇక, గుజరాత్‌తో మ్యాచ్‌లో యువ బౌలర్ రాజ్‌వర్దన్ హంగార్గేకర్ ప్రదర్శనపై ఫ్లెమింగ్ ప్రశంసలు కురిపించాడు. మరి.. ధోనీలో మునుపటి వేగం తగ్గిందంటూ వస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.