సన్ రైజర్స్ పరువు ఎవరో తీయాల్సిన అవసరం లేదు. వీళ్లకే వీళ్లే పోగొట్టుకుంటున్నారు. తాజాగా దిల్లీతో మ్యాచ్ లోనూ సేమ్ అదే జరిగినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు కెప్టెన్ మార్క్రమ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అంటే ఇదేనేమో! సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుని చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 7 మ్యాచులాడితే అందులో కేవలం రెండింట్లోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీపడుతున్నట్లు ఆడుతోంది! వేలంలో పలువురు ప్లేయర్స్ ని కోట్లు పెట్టి కొన్నారు. సీజన్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ తోపు, తురుము అన్నట్లు కలరింగ్ ఇచ్చారు. కట్ చేస్తే మ్యాచులు గెలవడానికే నానా తంటాలు పడుతోంది. తాజాగా దిల్లీతో మ్యాచ్, అది కూడా హౌమ్ గ్రౌండ్ లో.. అయినా సరే గెలవలేకపోయింది. ఈ క్రమంలోనే SRH కెప్టెన్ మార్క్రమ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిపోయాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ 144/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ ఏం లాభం. ఛేదనలో హైదరాబాద్.. 137/6 పరుగులకే పరిమితమైంది. చాలా సింపుల్ టార్గెట్, జట్టులో హ్యారీ బ్రూక్, మార్క్రమ్, క్లాసెన్ తోపాటు రాహుల్ త్రిపాఠి లాంటి మంచి మంచి బ్యాటర్లు ఉన్నారు. అయినా సరే ఏం ఉపయోగం. ప్రతి మ్యాచ్ లోనూ వీళ్లు చేతులెత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత జట్టు బ్యాటింగ్ తీరుపై మార్క్రమ్ అసహనం వ్యక్తం చేశాడు. గెలవాలనే ఇంట్రెస్ట్ ఒక్కడికీ లేదని చెప్పుకొచ్చాడు.
‘చెత్త బ్యాటింగ్, గెలవాలనే కసి లేకపోవడం వల్లే మేం ఓడిపోయాం. మేం స్వేచ్ఛగా బ్యాటింగ్ విషయమై ఫోకస్ పెట్టాలి. మా తప్పుల్ని సరిదిద్దుకోవాలి. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలనుకున్నాం. కానీ ఆ దిశగా బ్యాటంగ్ చేయలేకపోతున్నాం. గెలవాలనే కసి ఈ రోజు మాకు లేకుండా పోయింది. దీంతో గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయాం. నిజాయితీగా చెప్పుకుంటే మా బౌలర్లు ప్రదర్శన మాత్రమే బాగుంది. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేసి తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఈ ఓటమికి బౌలర్లు ఏ మాత్రం కారణం కాదు’ అని కెప్టెన్ మార్క్రమ్ అన్నాడు. దీన్నిబట్టి చూస్తే.. హైదరాబాద్ జట్టులోని బ్యాటర్లు అందరూ వేస్ట్ అని అన్నట్లే! మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2023