అద్భుతం ఎప్పుడో ఒకసారే జరుగుతుంది. విపరీతమైన అంచనాల మధ్య రాణించడం అంత సులువు కాదు. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ రింకు సింగ్ పై చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.
ఐపీఎల్ లో కేకేఆర్ సంచలనం రింకు సింగ్ అదరగొట్టేస్తున్నాడు. టోర్నీకి ముందు ఈ యంగ్ ప్లేయర్ మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. గతేడాది ఒకటి రెండు ఇన్నింగ్స్ ల్లో మెరిసినా.. మ్యాచ్ ని గెలిపించిన సందర్భాలు లేవు. కానీ ఐపీఎల్ 16 లో రింకు సింగ్ అంచనాలకు మించి ఆడుతున్నాడు. ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి 5 బంతులకి 28 కొట్టాల్సిన దశలో వరుసగా 5 సిక్సర్లు కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో అందరి దృష్టిలో పడిన రింకు..ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అంతే కాదు నిన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడాడు. దీంతో అందరూ ఈ కేకేఆర్ బ్యాటర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా .. భారత మాజీ ఓపెనర్ డాషింగ్ బ్యాటర్ సెహ్వాగ్.. రింకు సింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
ఐపీఎల్ లో నిన్న సన్ రైజర్స్, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కేకేఆర్ గెలవాలంటే చివరి ఓవర్లో 32 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికే ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతున్న రింకు సింగ్ ఈ మ్యాచ్ లో కూడా ఏమైనా అద్భుతం చేస్తాడని కేకేఆర్ ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఉమ్రాన్ మాలిక్ చివరి ఓవర్లో అద్భుతమైన బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో కేకేఆర్ అభిమానులకి నిరాశ తప్పలేదు. రింకు సింగ్ ఈ మ్యాచ్ లో మెరుపులు మెరిపించినా.. జట్టుకి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. తాజాగా ఈ విషయంపై సెహ్వాగ్ స్పందించాడు.
“రింకు సింగ్ గ్రీజ్ లో ఉన్నంతవరకు కేకేఆర్ టీమ్ గెలుపుపై ధీమాగా ఉంటుంది. గతంలో ధోని, సచిన్ గ్రీజ్ లో ఉంటే విజయం మనదేనని నమ్మేవారు. ఇప్పుడు కేకేఆర్ టీమ్ కి రింకు సింగ్ ఆ నమ్మకాన్ని కలిగించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రింకు విధ్వంసం సృష్టించాడు. కానీ అంచనాల మధ్య ఇలాంటి ఫీట్ సాధించడం అసాధ్యం. అదేదో ఫ్లో లో వచ్చేసింది. అదే చివరి ఓవర్ దయాల్ కాకుండా జోసెఫ్ వేసి ఉంటే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడేవాడు కాదు. రింకు సింగ్.. దయాళ్ ని గతంలో నెట్స్ లో ఎదర్కొన్నాడు. దీంతో దయాళ్ తర్వాత బంతిని ఎక్కడ వేస్తాడో పసి గట్టగలిగాడు. కానీ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో మళ్ళీ ఆ ఫీట్ సాధించలేకపోయాడు”. అని సెహ్వాగ్ కామెంట్ చేసాడు.