ఐపీఎల్ పదహారో సీజన్లో ముంబై ఇండియన్స్ కథ తిరిగి మొదటికి చేరుకుంది. సక్సెస్ రూట్‌ను అందుకున్నట్లే కనిపించి తిరిగి పరాజయాల బాట పట్టిందా టీమ్. రోహిత్ శర్మ ఫామ్ ముంబైని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో టైటిల్ ఫేవరెట్స్‌లో ముంబై ఇండియన్స్ ఒకటి. అత్యధిక సార్లు (ఐదు సార్లు) కప్ అందుకున్న జట్టు ముంబైనే కావడం విశేషం. అయితే మిగతా టాప్ జట్లలా ఆరంభం నుంచి దూకుడుగా ఆడదు ముంబై. సీజన్ మొదట్లో కొన్ని మ్యాచ్‌లు ఓడిపోవడం, ఆ తర్వాత పుంజుకుని వరుసగా గెలుస్తూ ప్లేఆఫ్స్, ఫైనల్స్‌కు చేరుకోవడం ముంబై ఇండియన్స్‌కు పరిపాటిగా మారింది. ఈసారి కూడా ముంబై పడుతూ లేస్తూ ముందుకెళ్తోంది. ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడిన ముంబై జట్టు.. మూడు మ్యాచుల్లో నెగ్గింది. గెలుపుబాట పట్టినట్లే కనిపించిన టీమ్.. వెంటవెంటనే రెండింట్లో ఓడటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్-2023 పాయింట్ల పట్టికలో ముంబై టీమ్ ఏడో స్థానంలో ఉంది.
గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 207 రన్స్ చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేధనలో ముంబై ఇండియన్స్ ఫెయిలైంది. ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 రన్స్‌కే చతికిలపడింది. ఛేదనలో సారథి రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. 8 బాల్స్ ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. రెండు రన్స్ మాత్రమే చేశాడు. ప్రత్యర్థి కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఆడిన చెత్త షాట్లలో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. ఈ సీజన్లో అంతగా ఆకట్టుకోని హిట్‌మ్యాన్.. ఒకే ఒక్కసారి భారీ స్కోరు (65 రన్స్) చేశాడు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ఇన్నింగ్స్ ఆడలేదు.
రోహిత్ బ్యాటింగ్ ఫెయిల్యూర్‌పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. గుజరాత్ టైటాన్స్ మీద అతడు ఔట్ అయిన తీరు ఆందోళనకు గురి చేస్తోందన్నాడు గవాస్కర్. ఐపీఎల్లో రాబోయే కొన్ని మ్యాచ్‌ల నుంచి రోహిత్ బ్రేక్ తీసుకోవాలన్నాడు. సీజన్ చివర్లో అతడు ఎంట్రీ ఇచ్చినా పర్లేదని.. విశ్రాంతి మాత్రం తప్పనిసరి అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ముగిసన తర్వాత భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడాల్సి ఉందని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్ ప్రిపరేషన్స్ కోసం రోహిత్‌కు బ్రేక్ తప్పదని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అతడి వైఫల్యం డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టుపై పడకూడదని తాను కోరుకుంటున్నానని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.