ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకి రికార్డులేమి కొత్త కాదు. ఐపీఎల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు తన జర్నీని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన రోహిత్.. నిన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మరొక రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ లో రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2008 నుండి ఇప్పటివరకు ఐపీఎల్ ఆడుతున్న అతి కొద్ది మంది ప్లేయర్లలో రోహిత్ ఒకడు. ప్రారంభంలో హైదరాబాద్ జట్టుకి ఆడిన రోహిత్ ఆ తర్వాత సొంత టీమ్ ముంబై కి వచ్చేసాడు. టీమ్ ఏదైనా సొగసైన బ్యాటింగ్ తో ఐపీఎల్ లో తనదైన ముద్ర వేసాడు. ఈ క్రమంలో ఎన్నో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఈ ముంబై సారధి.. తాజాగా ఒక రికార్డుని తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డ్ ఏంటంటే ?
ఐపీఎల్ 2023 లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అంతగా ఫామ్ లో లేకపోయినా రికార్డులు మాత్రం వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే బ్యాటర్ గా, కెప్టెన్ గా ఎన్నో రికార్డులు నెలకొల్పిన రోహిత్ నిన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో 6000 పరుగులు సాధించిన నాలుగో ప్లేయర్ గా నిలిచాడు. ఇప్పటికే ఈ లిస్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్, ఆస్ట్రేలియన్ విధ్వంసక వీరుడు వార్నర్ ఉన్నారు. వాషింగ్ టన్ సుందర్ వేసిన మూడో ఓవర్లలో రెండో బంతికి ఫోర్ కొట్టిన రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. గత రెండు సీజన్లుగా రోహిత్ బ్యాట్ నుంచి పెద్దగా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ రాకపోయినా.. రికార్డులు మాత్రం సెట్ చేస్తున్నాడు.
ఇక ఈ సీజన్ ఐపీఎల్ లో రోహిత్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. దాదాపు 23 ఇన్నింగ్స్ ల తర్వాత హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి హాఫ్ సెంచరీ వచ్చి చేరినా.. ఆ తర్వాత అలాంటి ప్రదర్శన కొనసాగించలేకపోతున్నాడు. నిన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 28 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ప్రతి మ్యాచ్ లో మంచి స్టార్ట్ వచ్చిన దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. రోహిత్ లాంటి బ్యాటర్ కి ఇలాంటి చిన్న ఇన్నింగ్స్ లు ఏమాత్రం సరిపోవు. గత సీజన్ లో కూడా రోహిత్ విఫలమైన సంగతి తెలిసిందే. మరి ఈ సీజన్ లో నైనా రోహిత్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.