ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫెయిల్యూర్ పరంపర నడుస్తోంది. వరుస మ్యాచుల్లో రోహిత్ డకౌట్ అయ్యాడు. అతడి ఫామ్ లేమి ముంబైతో పాటు టీమిండియా అభిమానులను కూడా కలవరపెడుతోంది.
ఐపీఎల్ పదహారో సీజన్లో టీమిండియా సారథి, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 10 మ్యాచుల్లో కేవలం 184 రన్స్ మాత్రమే చేశాడు. గత రెండు మ్యాచుల్లో హిట్‌మ్యాన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక డకౌట్లు అయిన ప్లేయర్‌గా రోహిత్ ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ లీగ్‌లో హిట్‌మ్యాన్ 16 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై సారథి బ్యాటింగ్‌లో ఎలాంటి సమస్య లేదని.. అయితే అతడు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
రోహిత్ శర్మ మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అతడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడని తెలిపాడు. హిట్‌మ్యాన్‌లో కాస్త గందరగోళం నెలకొందని.. అందుకే బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ‘రోహిత్ బ్యాటింగ్ టెక్నిక్‌తో ఎటువంటి సమస్య లేదు. అయితే అతడు మునుపటి లయను అందకునేందుకు ఒక్క మంచి ఇన్నింగ్స్ చాలు. ఫామ్‌లోకి వస్తే అతడ్ని ఆపడం ఎవరి తరమూ కాదు’ అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. ఇకపోతే, ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా ఎక్కువ టైమ్ లేదు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫామ్‌ను అందుకోవడం తప్పనిసరిగా మారింది. అతడు తిరిగి ఫామ్‌లోకి రావడం ముంబైతో పాటు టీమిండియాకూ చాలా కీలకమని చెప్పొచ్చు.