Rinku Singh: కుటుంబ అవసరాల కోసం స్వీపర్‌గా పనిచేశాడు.. క్రికెట్ ఆడినందుకు తండ్రి చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు! కట్ చేస్తూ.. ఇప్పుడు ఐపీఎల్‌లో అతనో సెన్సెషన్..
6 బంతుల్లో 29 పరుగులు కావాలి. క్రీజ్‌లో ఉమేష్ యాదవ్, యువ క్రికెటర్ రింకూ సింగ్ ఉన్నారు. అంతకంటే ముందే.. ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దుల్ ఠాకూర్ లాంటి హిట్టర్లను రషీద్ ఖాన్ వరుస బంతుల్లో అవుట్ చేసి.. ఐపీఎల్ 2023లో తొలి హ్యాట్రిక్ సాధించి.. విజయంపై కొండంత ధీమాలో ఉన్నారు. ఏ బౌలర్ వేసినా.. చివరి ఓవర్‌లో 29 పరుగులు అసాధ్యం అనే నమ్మకంతో గుజరాత్ టైటాన్స్ ఉంది. చివరి ఓవర్ వేసేందుకు యాశ్ దయాళ్ బంతి అందుకున్నాడు. తొలి బంతికి ఉమేష్ యాదవ్ సింగ్ తీసి.. స్ట్రైక్‌ను రింకూ సింగ్‌కు ఇచ్చాడు. 5 బంతుల్లో 28 పరుగులు.. అద్భుతం జరిగితే తప్పా.. కేకేఆర్‌కు గెలిచే అవకాశం లేదు.
అలాంటి అద్భుతాన్నే చేసి చూపించాడు రింకూ సింగ్. చివరి ఐదు బంతుల్లో ఐదు భారీ సిక్సర్లు కొట్టి.. ఐపీఎల్ 2023 సీజన్‌కే హైలెట్‌గా నిలిచిపోయే ఫినిష్ ఇచ్చాడు. ఓటమిని ఒప్పుకున్న కేకేఆర్ సంబురాలు చేసుకుంటే.. విజయాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న గుజరాత్.. పువ్వుల్లో పెట్టి కేకేఆర్ చేతుల్లో పెట్టింది. ఈ మ్యాచ్ తర్వాత రింకూ సింగ్ పేరు మారుమోగిపోయింది. ఎవరీ రింకూ సింగ్ అంటూ క్రికెట్ అభిమానులు తెగ ఆసక్తి చూపించారు. అయితే.. రింకూ ప్రస్థానం గురించి తెలుసుకుంటే.. అతను కొట్టిన సిక్సుల వెనుక ఎందరి కష్టం ఉందో? రింకూ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నాడు? తన ప్రయాణంలో ఎంత కృషి, పట్టుదల ఉందో అర్థమవుతోంది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో పుట్టిన రింకూ సింగ్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి ఇంటింటి వెళ్లి గ్యాస్ సిలిండర్లు డెలవరీ చేసేవాడు. రింకూకు ఇద్దరు అన్నయ్యలు.. ఒకరు ఆటో డ్రైవర్ కాగా.. ఇంకొకరు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తుండేవారు. ఖంచంద్ర సింగ్-వీణా దంపతుల ఐదుగురు సంతానంలో రింకూ మూడో వాడు. తండ్రి, సోదరులు కుటుంబం కోసం పడుతున్న కష్టం చూసి.. రింకూ సైతం ఒకానొక సందర్భంలో స్వీపర్‌గా పనిచేశాడు. ఆ పనితో తండ్రికి చేదొడువాదొడుగా ఉండొచ్చని రింకూ అనుకున్నాడు. సంఖ్యలో రింకూది చాలా పెద్ద ఫ్యామిలీనే. తల్లిదండ్రులు, అన్నావదినలు, వారి పిల్లలు, రింకూ చెల్లెళ్లు అంతా కలిసి కేవలం రెండు గదులు ఇంట్లో నివసించే వారు. ఇలాంటి నిరుపేద పరిస్థితుల నుంచి నేడు.. ఐపీఎల్‌లో స్టార్‌గా ఎదిగేంతలా సాగింది రింకూ ప్రస్థానం.
కుటుంబ పరిస్థితులు చూసి.. ఒక వైపు పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమైపోదామంటే.. క్రికెట్‌పై చిన్నతనం నుంచి ఉన్న పిచ్చి ఇష్టం మనసును అటువైపు లాగేస్తోంది. రింకూ క్రికెట్ ఆడటం తండ్రికి అస్సలు ఇష్టం లేదు. అయినా ఆయనకు తెలియకుండా ఆడుతుండే వాడు. దొరికినప్పుడు బెత్తం దెబ్బలే. కానీ.. 2012లో ఓ టోర్నమెంట్‌లో బాగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కింద బైక్ గెలిచిన రింకూ తీసుకొచ్చి తండ్రికి బహుమానంగా ఇచ్చాడు. దానిపైనే రింకూ తండ్రి గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాడు. కొడుకులోని టాలెంట్‌ను అప్పుడు గుర్తించిన ఖంచంద్ర సింగ్.. అప్పటి నుంచి రింకూ క్రికెట్‌కు అడ్డుపడలేదు. 2014లో ఉత్తర ప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన రింకూ.. 2017లో తొలి సారి ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. అప్పటికీ రింకూకు కేవలం 19 ఏళ్లే. పంజాబ్ ఫ్రాంచైజ్ రింకూ కొనుగోలు చేసినా.. తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. 2018లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్.. రింకూను వేలంలో రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి రింకూ కేకేఆర్‌తోనే సాగుతున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 15 బంతుల్లో 40 పరుగులు చేసి.. మ్యాచ్‌ను గెలిపించేంత పనిచేశాడు. కానీ.. 3 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి దశలో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ తృటిలో ఓటమి పాలైనా.. రింకూ సింగ్ పోరాటంపై ప్రశంస వర్షం కురిసింది. ఆ మ్యాచ్‌తో రింకూ పేరు పాపులర్ అయింది. మళ్లీ ఈ సీజన్‌లో మూడో మ్యాచ్‌లోనే చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. చివరి బాల్‌కు సిక్స్ కొట్టిన గెలిపించిన క్రికెటర్లు ఉన్నారు. కానీ.. చివరి ఐదు బంతుల్లోనూ ఐదు సిక్సులు కొట్టి మ్యాచ్ గెలిపించిన ఆటగాడు రింకూ సింగ్. ఇలాంటి ఆటగాడు మరింత షైన్ అయి.. టీమిండియాకు ఆడాలని క్రికెట్ ఫ్యాన్స్ కొరుకుంటున్నారు. మరి రింకూ ఇన్నింగ్స్‌తో పాటు అతని నేపథ్యం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
FIVE SIXES IN A ROW 🤯
Rinku Singh, that is sensational! 👏 pic.twitter.com/XjUAy4SKk1
— Sky Sports Cricket (@SkyCricket) April 9, 2023
Rinku Singh – the hero of KKR in an interview with captain Nitish Rana. pic.twitter.com/bJtgQnyk1s
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2023