క్రికెట్లో బ్యాట్స్‌మెన్ బాదుడుకు బౌలర్లు బలవ్వడం కామనే. ఈ బాదుడు వల్ల బౌలర్లు నిరుత్సాహానికి గురవుతుంటారు. అందులో నుంచి కోలుకుని, మళ్లీ పుంజుకోవడం అంత సులువు కాదు.
ఏ ఆటలో అయినా గెలుపోటములు సహజం. జెంటిల్మన్ గేమ్ క్రికెట్ కూడా అంతే. ఇవ్వాళ గెలిచిన జట్టు, రేపు నెగ్గుతుందని చెప్పలేం. అదే తరహాలో ఇవ్వాళ ఒక మ్యాచ్‌లో బాగా ఆడిన ఆటగాళ్లు.. తర్వాతి మ్యాచ్‌లోనూ అలాగే ఆడతారని చెప్పలేం. కొన్ని మ్యాచ్‌లు ప్లేయర్లకు ఎంత పేరును తీసుకొస్తాయో, కొన్ని మ్యాచ్‌లు మాత్రం వారికి పీడకలగా మిగిలిపోతాయి. అలాంటి ఒక మ్యాచే కోల్‌కతా నైట్ రైడర్స్-గుజరాత్ టైటాన్స్‌కు మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ హిట్టర్ రింకూ సింగ్ వరుసగా ఐదు బాల్స్‌లో ఐదు సిక్సులు కొట్టి తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. ఒకవైపు రింకూ సిక్సుల మోతతో ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోగా.. అతడి వీరబాదుడుకు బలైన ప్రత్యర్థి బౌలర్ యష్ దయాల్‌కు మాత్రం ఇదో పీడకలలా మారింది.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో యష్ దయాల్ 4 ఓవర్లలో 69 రన్స్ ఇచ్చి.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శన యష్‌ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. రింకూ ధాటికి అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. రిస్ట్ బ్యాండ్‌ను అడ్డం పెడ్డుకొని యష్ దయాల్ ఏడ్చేశాడు. అయితే యష్ దయాల్‌కు సీనియర్ క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. క్రికెట్లో ఇలాంటివి సాధారణమంటూ ధైర్యం చెబుతున్నారు. దయాల్‌కు తండ్రి కూడా అండగా నిలిచారు. తదుపరి మ్యాచ్‌కు తాను హాజరవుతానని ఆయన కొడుక్కి ధైర్యం చెప్పారు.
‘మ్యాచ్ ముగిసిన వెంటనే నేను యష్ దయాల్‌కు కాల్ చేసి మాట్లాడా. ఏ మాత్రం భయపడొద్దని, నిరాశకు గురవ్వొద్దని సూచించా. క్రికెట్లో ఇలా జరగడం ఇదేమీ కొత్త కాదు. బౌలర్లను బాదడం మామూలే. ఎక్కడ తప్పు చేశావో తెలుసుకుని మరింత కష్టపడాలని సూచించా. అతడు కచ్చితంగా పుంజుకుంటాడు’ అని యష్ తండ్రి చెప్పుకొచ్చారు. కొడుకును అలా చూసి తన తల్లి కూడా భోజనం చేయడం మానేశారని యష్ తండ్రి తెలిపారు. అయితే దిగులు చెందాల్సిన అవసరం లేదని.. తప్పులు తెలుసుకుని, నేలకు కొట్టిన బంతిలా త్వరగా పుంజుకోవాలని ధైర్యం చెప్పినట్లు యష్ తండ్రి పేర్కొన్నారు.