చెన్నై సూపర్ కింగ్స్.. ఈ జట్టులో చెప్పుకోదగ్గ బ్యాటర్ లేడు. బౌలింగ్ లో గుర్తుంచుకోదగ్గ వాళ్లు లేరు. మహా అయితే కొత్త కుర్రాళ్లు, వయసు అయిపోయి ఫామ్ లో లేకపోవడంతో అన్ని ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లే కనిపిస్తారు. కెప్టెన్ ధోనీ, ఆల్ రౌండర్ జడేజా మాత్రం కాస్త చెప్పుకోదగ్గ ప్లేయర్లు. వాళ్ల ఆట కూడా అంతంత మాత్రమే. గత సీజన్ లో పాయింట్ల పట్టికలో కింద నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈ జట్టుపై ఏ మాత్రం అంచనాల్లేవు. అయినా సరే అద్భుతం చేసింది. స్టార్స్ తో ఉన్న గుజరాత్ ని ఫైనల్లో ఓడించింది. ఐదోసారి కప్ కొట్టి చరిత్ర సృష్టించింది. అసలు ఈ విజయం చెన్నైకి ఎలా సాధ్యమైంది? ధోనీ మ్యాజిక్ పనిచేయడానికి రీజన్ ఏంటి?
అసలు విషయానికొచ్చేస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే అందరికీ ధోనీనే గుర్తొస్తాడు. కొన్నాళ్ల ముందు వరకు రైనా, వాట్సన్, డుప్లెసిస్ లాంటి స్టార్లు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే కుర్రాళ్లు లేదంటే వయసైపోయిన ఆటగాళ్లు మాత్రమే జట్టులో ఉన్నారు. ఇలాంటి టీమ్ ని ధోనీ ఎలా నడిపిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు. రహానె, దూబె, పతిరానా.. ఇలా చెప్పుకుంటే పోతే ఈ సీజన్ లో అద్భుతాలు చేసినవాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్ల గురించి చెన్నై సక్సెస్ సీక్రెట్ గురించి అలా మాట్లాడేసుకుందాం.
మళ్లీ ఐపీఎల్ లో కనిపించడం కష్టమే అనుకున్న రహానె.. ఈ సీజన్ లో చెన్నైకి ఆడాడు. ప్రారంభ మ్యాచ్ ల్లో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి జట్టు విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. ఇప్పటివరకు ఐపీఎల్ పెద్దగా ప్రభావం చూపని శివమ్ దూబె కూడా.. చెన్నై తరఫున తనదైన మార్క్ ఇన్నింగ్స్ లు ఆడాడు. చెప్పాలంటే సిక్సర్ల దూబెగా మారిపోయాడు. మలింగని పోలిన బౌలింగ్ శైలితో ఫేమ్ తెచ్చుకున్న 20 ఏళ్ల కుర్రాడు పతిరానాని ధోనీ భలేగా ఉపయోగించుకున్నాడు. డెత్ ఓవర్లలో మెయిన్ బౌలర్ ని చేసేశాడు. ఇతర జట్లకు ఆడినప్పుడు వీళ్లేం పనికొస్తారులే అనుకున్నోళ్లు చెన్నై జట్టులోకి వచ్చిన తర్వాత డేంజరస్ ప్లేయర్లుగా మార్చిన ఘనత ధోనీకే దక్కుతుంది. ఇదే చెన్నై కప్ కొట్టడానికి ఓ కారణం అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
మిగతా జట్లకు, చెన్నై టీమ్ కు ఉన్న తేడా ఏంటంటే యూనిటీ(సమష్టితత్వం). ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. వాళ్లకు నచ్చినట్లు ఆడే ఛాన్స్ ధోనీ కల్పిస్తాడు. నిజానికి ఫైనల్ లో ఓ దశవరకు ధోనీకి ఏదీ కలిసి రాలేదు. చెప్పాలంటే ఐపీఎల్ ఫైనల్స్ లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్లే చాలా సందర్భాల్లో గెలిచాయి. అయినాసరే తాజాగా ఫైనల్లో టాస్ గెలిచి ధోనీ బౌలింగ్ తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. దీనికి తగ్గట్లు గుజరాత్ 214 భారీ స్కోరు చేసేసరికి అందరూ చెన్నై గెలవడం కష్టమే అనుకున్నారు. ఒక్క ధోనీ తప్ప. ఎందుకంటే అతడు ఊహించిందే నిజమైంది. వర్షం కారణంగా రెండున్నర గంటలకు పైగా మ్యాచ్ లేట్ అయిపోయింది. దీంతో 15 ఓవర్లలో 171 టార్గెట్ అని ఫిక్స్ చేశారు. ఛేదనలో చెన్నై బ్యాటర్లు మొదటి నుంచే గుజరాత్ బౌలర్లపై రెచ్చిపోయారు. దీంతో చెన్నై గెలిచేసింది. ఐదోసారి కప్పును ముద్దాడింది. ఇక్కడ మీరు గమనిస్తే ధోనీ కెప్టెన్సీ అనుభవం చాలా అంటే చాలా ఉపయోగపడింది. చెన్నై చిరస్మరణీయ విజయానికి కారణమైంది. మరి ధోనీ మార్క్ మ్యాజిక్ తో చెన్నె కప్ కొట్టడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.