ప్రతి సీజన్ లానే ఆర్సీబీకి ఆటతీరులో ఈసారి కూడా అస్సలు మారలేదు. తొలి మ్యాచ్ లో గెలిచింది. ఆ తర్వాత రెండింటిలో ఓడిపోయింది. ఇంతకీ తప్పు ఎక్కడ జరుగుతోంది? బెంగళూరు ప్లేయర్లు ఏం చేస్తున్నారు?
ఐపీఎల్ పేరు చెప్పగానే వందలో 90 మందికి గుర్తొచ్చే టీమ్ పేరు ఆర్సీబీ. ఈ జట్టే దురదృష్టాన్ని పట్టుకుని తిరుగుతుందా? లేదా బ్యాడ్ లక్ ఈ టీమ్ ని వెంటాడుతుందా అనేది అస్సలు అర్థం కాదు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు.. 15 ఏళ్లుగా కప్ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్న వన్ అండ్ ఓన్లీ జట్టు ఏదైనా ఉందా అంటే అది ఆర్సీబీ మాత్రమే. ప్రతిసారి ఆహా ఓహో అని బిల్డప్ తో రెడీ అవడం. తీరా చూస్తే గెలవాల్సన మ్యాచుల్లోనూ ఘోరంగా ఓడిపోయి.. అందరితో తిట్టించుకోవడం. ప్రతి సీజన్ లో ఆర్సీబీకి ఇది కామన్ అయిపోయింది. ఈసారి కూడా దాదాపు అలానే చేస్తోంది. ఆడింది మూడు మ్యాచులే అయినా ఆల్రెడీ తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ టీమ్. కుంబ్లే కెప్టెన్ గా కొన్నాళ్లు చేశాడు. ఆ తర్వాత జట్టు పగ్గాలు కోహ్లీకి వచ్చాయి. ఇప్పుడు డుప్లెసిస్ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. కెప్టెన్స్ మారుతున్నారు. జట్టులోకి స్టార్ ప్లేయర్లు వచ్చిపోతున్నారు. కానీ ఆ కప్ మాత్రం అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. అయితే బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆర్సీబీ పదేపదే అదే తప్పులు చేస్తోంది. దీంతో గెలిపించాల్సిన సొంత ప్లేయర్లే ఓటమికి కారణమవుతున్నారు. తాజాగా జరిగిన లక్నోతో మ్యాచ్ లోనూ సేమ్ ఇదే సీన్ రిపీటైంది.
సొంత మైదానంలో జరిగిన మ్యాచులో ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. కోహ్లీ 61, డుప్లెసిస్ 79 నాటౌట్, మ్యాక్స్ వెల్ 59 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. దీంతో 212/2 పరుగుల భారీ స్కోరు చేసింది. అయినా సరే మ్యాచ్ చూస్తున్న ఏ ఒక్కరికీ కూడా ఆర్సీబీ గెలుస్తుందనే నమ్మకం లేదు. రియాలిటీలోనూ అదే జరిగింది. బౌలింగ్ లో సిరాజ్, విల్లీ తప్పితే మిగిలిన వాళ్లందరూ ఘోరంగా అంటే ఘోరంగా ఫెయిలయ్యారు. ప్రత్యర్థి జట్టకు రన్స్ ఇవ్వడమే పని అన్నట్లు బౌలింగ్ చేశారు. పార్నెల్ 41, హర్షల్ పటేల్ 48, కర్ణ్ శర్మ 48 పరుగులిచ్చేశారు. ఒకే ఓవర్ వేసిన షాబాజ్ కూడా 15 పరుగులిచ్చేశాడు.
ఇక ఆర్సీబీ గెలవడానికి 1 బంతికి 1 పరుగు చేయాల్సిన పరిస్థితి. హర్షల్ పటేల్ బౌలింగ్ చేస్తున్నాడు. కాస్త డిఫరెంట్ గా ప్రయత్నిద్దామని మన్కడింగ్ కోసం ట్రై చేశాడు. పోనీ అందులోనైనా సక్సెస్ అయ్యాడా అంటే అదీ లేదు. దీంతో ఉన్న పేరు కాస్త పోయింది. ఈ ఒక్క మ్యాచే కాదు.. ప్రతి మ్యాచ్ లోనూ ఒకరు కాకపోతే ఇంకొకరు అన్నట్లు ఆర్సీబీ బౌలర్లు ఫెయిలవుతున్నారు. బ్యాటింగ్ లోనూ కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ ఒకవేళ తక్కువ రన్స్ కే ఔటైతే మిగతా బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఆర్సీబీ బ్యాడ్ లక్ ఎక్కడో లేదు.. సొంత ప్లేయర్లలోనే ఉంది అన్నట్లు అనిపిస్తుంది. మరి ఆర్సీబీ కప్ కొట్టేది ఎప్పుడని మీరనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.