ఆర్సీబీ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇన్ని సీజన్లు ఏ తప్పయితే చేసిందో మళ్లీ ఇప్పుడు దాన్నే రిపీట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. దాని ఫలితమే తాజాగా కోల్ కతా జట్టుపై ఓటమి. ఇంతకీ ఆర్సీబీ ఎక్కడ తప్పు చేస్తోంది?
ఆర్సీబీ.. మళ్లీ వింటేజ్ ఫామ్ లోకి వచ్చేసింది! నవ్వకండి ఇదే నిజం! ఎందుకంటే కెప్టెన్స్, సీజన్స్ మారుతున్నాయి తప్పితే.. బెంగళూరు జట్టు ఆట మాత్రం అస్సలు ఛేంజ్ కావట్లేదు. గత 15 ఏళ్లుగా కప్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు. ప్రతిసారి ‘ఈసాలా కప్ నమదే’ అనుకోవడం.. ఓ నాలుగైదు మ్యాచులకే అభిమానుల ఆశల్ని అడియాశలు చేస్తూ టోర్నీలో ఘోరమైన ప్రదర్శన చేయడం ఆర్సీబీకి చాలా కామన్ అయిపోయింది. ఈ సీజన్ లోనూ ముంబయిపై ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు కోల్ కతా చేతిలో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. అయితే బెంగళూరు జట్టు మళ్లీ మళ్లీ చేస్తున్న ఆ ఒక్క తప్పే ఈ ఓటములకు కారణమని తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం రాత్రి ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు ఓ దశలో 89/5 వికెట్లతో ఉంది. టాపార్డర్ బ్యాటర్లతో పాటు విధ్వంసకర రసెల్ కూడా ఔటైపోయాడు. దీంతో కేకేఆర్, 120 పరుగులు చేస్తే గొప్పనే అని స్టేడియంలో ఉన్నవాళ్లతోపాటు మ్యాచ్ చూస్తున్నవాళ్లు అనుకున్నారు. కానీ ఆపద్భాందవుడిలా వచ్చిన శార్దుల్ ఠాకుర్ రెచ్చిపోయాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ కి దిగి 29 బంతుల్లో 68 రన్స్ కొట్టి ధనాధన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించాడు. ఇతడికి రింకూ సింగ్ (46 పరుగులు) సపోర్ట్ ఇచ్చాడు. దీంతో కేకేఆర్ 204 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ.. తొలి ఐదు ఓవర్ల వరకు బాగానే ఆడింది. తొలి వికెట్ కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ.. 21 రన్స్ కొట్టి ఔటైపోయాడు. డుప్లెసిస్ 23, బ్రాస్ వెల్ 19 కూడా వెంటవెంటనే ఔటైపోయారు. మిగతా బ్యాటర్లు అందరూ ఇలా వచ్చామా అలా వెళ్లామా అన్నట్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో 123 పరుగులకు ఆర్సీబీ ఆలౌటైపోయింది. 81 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అయితే ఆర్సీబీ ఓడిపోవడానికి బ్యాటర్లది తప్పా, బౌలర్లది తప్పా అంటే అందరిదీ తప్పే అని అంటున్నారు నెటిజన్స్.
ఎందుకంటే ముంబయితో జరిగిన ఫస్ట్ మ్యాచ్ నే తీసుకోండి. ప్రారంభంలో ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి వికెట్లు తీశారు. దీంతో 48/4తో నిలిచింది. కానీ తిలక్ వర్మ బ్యాటింగ్ తో ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. ఫలితంగా 171 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ మ్యాచులో కోహ్లీ, డుప్లెసిస్ బ్యాటింగ్ తో అదరగొట్టారు కాబట్టి బెంగళూరు గెలిచేసింది లేదంటే ఫస్ట్ మ్యాచులోనే ఓడిపోయేది. కోల్ కతాతో మ్యాచులోనూ సేమ్ సీన్ రిపీటైంది. కాకపోతే ఈసారి బౌలర్లు, బ్యాటర్లు ఇద్దరూ చేతులెత్తేశారు. ఇలాంటి లైనప్ తో ఈ సీజన్ లో ఆర్సీబీ కప్ కొడుతుందని అనుకోవడం ఆలోచించాల్సిన విషయమే? ఇప్పటికైనా బౌలింగ్, బ్యాటింగ్ లో అనిశ్చితిని కట్టడి చేసుకుంటే ఆర్సీబీ సెట్ అవుతుంది. లేదంటే ఈసారి కూడా కప్ పై ఆశలు వదిలేసుకోవాల్సి వస్తుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఆర్సీబీ ఆటతీరుపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.