ఆర్సీబీ జట్టు తలరాత మారలేదు. ఆ జట్టు మరోమారు కప్ గెలవకుండానే ఐపీఎల్లో తమ ప్రయాణాన్ని ముగించింది. బెంగళూరు వైఫల్యానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే స్వయంగా ఆ టీమ్ కెప్టెన్ డుప్లెసిస్ తమ జట్టు కప్ గెలవదని ముందే చెప్పాడు. కానీ దీన్ని ఎవరూ నమ్మలేదు.
రిచెస్ట్ క్రికెట్ లీగైన ఐపీఎల్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. 2008 నుంచి ఇప్పటివరకు జరిగిన పదిహేను సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా కప్ గెలవని టీమ్స్‌లో ఆర్సీబీ ఒకటి. పదహారో సీజన్లోనూ ఆ జట్టు రాత మారలేదు. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను ఆర్సీబీ చేజేతులా నాశనం చేసుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆ టీమ్ ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ (101 నాటౌట్) వరుసగా రెండో సెంచరీతో చెలరేగినా ఆ జట్టుకు విజయం దక్కలేదు. ఆర్సీబీ సంధించిన 197 రన్స్ టార్గెట్‌ను గుజరాత్ టైటాన్స్ మరో 5 బాల్స్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104 నాటౌట్) కూడా సెంచరీ బాదడం విశేషం. అతడికి త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ (53) మంచి సహకారాన్ని అందించాడు.
ఛేదనలో గుజరాత్‌ను కట్టడి చేయడంలో మహ్మద్ సిరాజ్ తప్ప మిగతా ఆర్సీబీ బౌలర్లు విఫలమయ్యారు. దీంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు నిష్క్రమించక తప్పలేదు. గుజరాత్‌పై బెంగళూరు ఓటమితో ముంబై ఇండియన్స్ తమ ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఆర్సీబీ ఫైనల్‌కు వెళ్తుందని, కప్ గెలుస్తుందని ఆ జట్టు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈసారి కూడా వారికి నిరాశ తప్పలేదు. అయితే ఆర్సీబీ కప్ గెలవదనే విషయాన్ని ఆ జట్టు సారథి డుప్లెసిస్ ఎప్పుడో చెప్పాడు. నెల రోజుల కింద, ఐపీఎల్ స్టార్టింగ్ టైమ్‌లో ఒక కార్యక్రమంలో ఫాఫ్ పాల్గొన్నాడు. అయితే ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్సీబీ స్లోగన్ అయిన ‘ఈ సాలా కప్ నమ్దే’ను జవాబుగా చెప్పాలనుకున్నాడు. కానీ ‘ఈ సాలా కప్ నహీ’ అనేశాడు. దీనర్థం.. ఈసారి కూడా కప్ తమకు రాదన్నాడు. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ సహా అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడీ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
Faf Du Plessis by mistake says “Ee Sala Cup Nahi”. pic.twitter.com/mhyR7Dd1hI
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2023