ఐపీఎల్ పదహారో సీజన్లో బెంగళూరు ప్రయాణం కాస్త తీపి, కాస్త చేదు అనేలా సాగుతోంది. ఒక మ్యాచ్ గెలవడం, తర్వాతి దాంట్లో ఓడటం ఆ జట్టుకు పరిపాటిగా మారింది. లీగ్ రెండో దశకు చేరుకుంటున్న నేపథ్యంలో వరుస విజయాలు సాధించడం ఆర్సీబీకి తప్పనిసరిగా మారింది.
అందని ద్రాక్షగా ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను ఈసారైనా ఒడిసిపట్టాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అనుకుంటోంది. అయితే ఆ దిశగా జట్టు ప్రయాణం అంత సాఫీగా సాగడం లేదు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో మూడింట్లో ఓడిన ఆర్సీబీ.. నాలుగు మ్యాచుల్లో విక్టరీ కొట్టింది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే తర్వాతి మ్యాచుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. అలసత్వానికి ఛాన్స్ ఇవ్వకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. అయితే ఇదేమంత సులభం కాదు. ఈసారి దాదాపుగా ప్రతి మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ వెళ్తోంది. గెలుస్తాయని అనుకున్న జట్లు కాస్తా విజయం ముంగిట బోల్తా పడుతున్నాయి. ఏ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఊహకు అందని పరిస్థితి.
ఈ సీజన్లో ఆర్సీబీ పడుతూ లేస్తూ వెళ్తోంది. కానీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే మాత్రం వరుసగా గెలుస్తూ పోవాలి లేదంటే కష్టమవుతుంది. సారథి ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్ భీకర ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే విరాట్ కోహ్లీ బ్యాడ్ ఫామ్ ఆర్సీబీ శిబిరంలో ఆందోళన రేపుతోంది. విరాట్ వరుసగా విఫలం అవుతున్నాడు. బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ జట్టుకు కొండంత అండగా నిలుస్తున్నాడు. ఆరంభ ఓవర్లతో పాటు ఆఖర్లోనూ వికెట్లు తీస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. అతడి పేస్, లైన్ అండ్ లెంగ్త్, స్వింగింగ్ డెలివరీలను ఎలా ఆడాలో తెలియక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు.
డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌తో పాటు విరాట్ కోహ్లీ గనుక లయ అందుకుంటే ఆర్సీబీని ఆపడం అంత ఈజీ కాదు. కోహ్లీ ఫామ్‌లోకి వస్తే ఛేజింగ్‌లో మ్యాచ్‌లు ఫినిష్ చేయడం సులువవుతుంది. బౌలింగ్‌లో సిరాజ్‌కు తోడుగా మిగతా బౌలర్లు కూడా మరింతగా చెలరేగితే బెంగళూరు సక్సెస్‌లతో దూసుకెళ్లొచ్చు. ఇదిలాఉంటే.. ఒక సెంటిమెంట్ ఆర్సీబీ ఫ్యాన్స్‌లో సంతోషం నింపుతోంది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఒక మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది ఆర్సీబీ. గత మ్యాచ్‌లో ఈ జెర్సీతో ఆడిన బెంగళూరు జట్టు.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. ఈ జెర్సీతో ఆడిన మ్యాచ్‌లో గెలిచిన రెండుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది ఆర్సీబీ. 2011, 2016లో గ్రీన్ జెర్సీ వేసుకుని ఆడిన మ్యాచుల్లో నెగ్గిన ఆర్సీబీ.. ఆయా సీజన్లలో ఐపీఎల్ తుదిపోరులో ఆడింది. ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తుందని జట్టు అభిమానులు ఆశిస్తున్నారు.
Fact check for our fans ✅
Whenever RCB has won matches in green jersey, we have played finals in that season 😍#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 pic.twitter.com/RjVHYU39lw
— Royal Challengers Bangalore FC (@RCBTweets__) April 25, 2023