ఐపీఎల్ హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటి ఆర్సీబీ. ఇప్పటివరకు ఒక్కసారి ట్రోఫీ నెగ్గకున్నా ఆ టీమ్‌కు అభిమానుల ఆదరణ మాత్రం తగ్గలేదు. అయితే ఈసారి ఎలాగైనా కప్ గెలవాల్సిందే అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. కప్ నెగ్గకుంటే పెళ్లి చేసుకోబోమంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. హేమాహేమీల లాంటి ప్లేయర్లు జట్టులో ఉన్నా ఆ టీమ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ఒడిసిపట్టలేదు. దీనికి కారణం ఏంటనేది అభిమానుల్లో పెద్ద మిస్టరీగా మిగిలిన ప్రశ్న అనే చెప్పాలి. ఈ ఏడాది కూడా ‘ఈ సలా కప్ నమ్దే’ అంటూ బరిలోకి దిగింది ఆర్సీబీ. పేపర్‌పై బలంగా ఉన్న ఈ జట్టుకు టైటిల్ గెలిచే సత్తా ఉందని చాలా మంది నిపుణులు అంటున్నారు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆర్సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ ఫామ్‌లో ఉండటం ఆ టీమ్‌కు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్ తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థికైనా ముచ్చెమటలు పట్టించగల సమర్థులే. ఇక, ఫినిషర్‌గా వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఎలాగూ ఉండనే ఉన్నాడు. అయితే కీలకమైన బౌలర్లు గాయాలతో జట్టుకు దూరమవ్వడం ఆర్సీబీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలాఉండగా.. ఈసారి ఎలాగైనా కప్ గెలవాల్సిందేనని కొందరు ఆర్సీబీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ఆర్సీబీ ట్రోఫీని గెలిచేంత వరకు తాము పెళ్లిళ్లు చేసుకోబోమని బోర్డులు పట్టుకుని మరీ బెంగళూరు మ్యాచులకు హాజరవుతున్నారు. ఆ ఫొటోలు చూసిన చాలా మంది మీ మ్యారేజ్ అయినట్లేనని జోకులు పేలుస్తున్నారు. మరి.. వీళ్లందరికీ బదులిచ్చేలా కోహ్లీ-డుప్లెసిస్ ద్వయం ఆర్సీబీకి ట్రోఫీ అందిస్తారేమో చూడాలి.