IPL 2023: ఐపీఎల్లో భారీ క్రేజ్ ఉన్న టీమ్ ఆర్సీబీ.. ఆ జట్టు ఎన్నిసార్లు విఫలమైనా వారి అభిమానంలో మార్పు ఉండదు. గెలిస్తే ఎంత సంతోషిస్తారో ఓడితే అంతే బాధపడతారు. సోమవారం లక్నోతో మ్యాచ్ తర్వాత ఇదే పరిస్థితి..
ఐపీఎల్ 2023ను విజయంతో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. సోమవారం హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ స్కోర్ చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ లక్నో బౌలర్లపై ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. కోహ్లీ ఆడుతున్నంత సేపు కెప్టెన్ డుప్లెసిస్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. పవర్ ప్లే తర్వాత స్పిన్నర్లు ఎంట్రీ ఇవ్వడంతో వేగం పెంచే క్రమంలో కోహ్లీ అవుట్ అయ్యాడు. 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసిన కోహ్లీ.. మరో అర్ధ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు.
కోహ్లీ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్లలో మ్యాక్సీ-డుప్లెసిస్ రెచ్చిపోయి ఆడాడు. సిక్సుల వర్షం కురిపించారు. డుప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాక్సీ 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 59 రన్స్ చేసి.. ఇన్నింగ్స్ చివరి బాల్ మిగిలి ఉండగా అవుట్ అయ్యాడు. చివరి బాల్‌కు డీకే సింగిల్ తీసి ఇన్నింగ్స్ ముగించాడు. మొత్తం మీద ఆర్సీబీ 212 పరుగుల భారీ స్కోర్ చేసి.. లక్నో ముందు 213 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను సిరాజ్ ఆరంభంలోనే చావు దెబ్బ తీశాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కైల్ మేయర్స్‌ను డకౌట్ చేశాడు. వన్ డౌన్లో వచ్చిన దీపక్ హుడా సైతం 9 పరుగులకే అవుట్ అవ్వడంతో ఇక ఈ మ్యాచ్‌లో లక్నో గెలవడం కష్టమే అని అంతా భావించారు.
కానీ.. స్టోయినీస్, నికోలస్ పూరన్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీళ్లిద్దరూ బ్యాటింగ్ చేస్తుంటే.. బౌండరీ లైన్ చిన్నబోయింది. కొడితే సిక్స్ లేదంటే ఫోర్ అనేలా సాగింది వీరి విధ్వంసం. తొలి 8 ఓవర్ల వరకు అసలు మ్యాచ్‌లోనే లేని లక్నో.. ఆ తర్వాత మొత్తం మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తీసుకుంది. స్టోయినీస్ 30 బంతుల్లో 65, పూరన్ 24 బంతుల్లో 62 పరుగులు చేసి.. ఆర్సీబీ ఓటమిని శాసించారు. అయితే.. వీరిద్దరూ అవుట్ అవ్వడంతో మ్యాచ్ చివరి బాల్ వరకు వెళ్లింది. చివరి బాల్‌కు సింగిల్ అవసరమైన దశలో హర్షల్‌పటేల్ వేసిన బాల్‌ను ఆవేశ్ ఖాన్ మిస్ చేశాడు. అయినా కూడా బైస్ కోసం పరుగులు తీశాడు. బాల్‌ను అందుకుని వెంటనే త్రో విసరడంలో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ విఫలం అయ్యాడు. లేదంటే మ్యాచ్ కచ్చితంగా సూపర్ ఓవర్‌కు వెళ్లేది. ఈ ఓటమితో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. కొంతమంది అభిమానులు గ్రౌండ్‌లోనే వెక్కివెక్కి ఏడ్చారు. తమ టాప్ త్రీ బ్యాటర్లు చెలరేగినా.. భారీ స్కోర్ చేసి చివరి బాల్‌కు ఓటమి ఎదురవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఆర్సీబీ అభిమానులు ఏడుస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీళ్ల కష్టం పగొడికి కూడా రాకూడదంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Me and RCB fans resembles her
#RCBvLSG
Vintage RCB pic.twitter.com/lpy9Zmpe0E— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) April 10, 2023