వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ముందు భారత జట్టును గాయాల బెడద వేధిస్తోంది. స్టార్ ఆటగాళ్లు ఇంజ్యురీలతో దూరమవుతుండటంతో టీమ్ మేనేజ్మెంట్ ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటోంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్ ఇంజ్యురీతో జట్టుకు దూరమయ్యాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా గాయం కారణంగానే టీమ్‌కు దూరంగా ఉంటున్నాడు. కేఎల్ రాహుల్ ఐపీఎల్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ నలుగురు ప్లేయర్లు మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు కీలక ఆటగాళ్లనేది తెలిసిందే. భారత బౌలింగ్ దళానికి బుమ్రా కొండంత అండగా నిలిచేవాడు. మన టీమ్ పేస్ అటాక్‌ను అతడే ముందుండి లీడ్ చేసేవాడు.
బుమ్రా జట్టులో ఉన్నాడంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. అలాంటి కీలక ఆటగాడు గాయం కారణంగా జట్టుకు దూరమవ్వడంతో పేస్ బౌలింగ్‌లో పదును తగ్గింది. బ్యాటింగ్‌లో మిడిలార్డర్ బాధ్యతను మోసే రాహుల్, అయ్యర్, పంత్‌ల లేమితో భారీ స్కోర్లు చేయడంలోనూ, ఛేదించడంలోనూ జట్టు ఇబ్బందులు పడక తప్పదు. ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్‌లు దూరమవడంతో ఆందోళనలో ఉన్న భారత జట్టుకు మరో షాకింగ్ న్యూస్. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇంజ్యర్డ్ ప్లేయర్ల లిస్టులో చేరాడు. అతడు ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడట. అందుకే పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు అశ్విన్ దూరమయ్యాడని తెలుస్తోంది.
అశ్విన్ గాయం విషయాన్ని స్వయంగా రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ టాస్ సమయంలో తెలిపాడు. రవిచంద్రన్ అశ్విన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని.. అందుకే అతడి ప్లేసులో ఇంకొకర్ని తీసుకున్నామని శాంసన్ వెల్లడించాడు. బుమ్రా, పంత్, రాహుల్, అయ్యర్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమైన వేళ.. అశ్విన్ కూడా ఇంజ్యురీతో అందుబాటులో ఉండేది అనుమానంగా మారడంతో భారత టీమ్ మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. జూన్ 7న లండన్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ తలపడనున్నాయి. అప్పటికి అశ్విన్ గాయం నుంచి కోలుకుంటాడేమో చూడాలి.