క్రికెట్లో ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌ల సందడి ఎక్కువైంది. జెంటిల్మన్ గేమ్ ఆడే బడా దేశాలు అన్నింట్లోనూ టీ20 లీగ్‌లు మొదలయ్యాయి. బిగ్‌బాష్ లీగ్ నుంచి బంగ్లా ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ వరకు ఎన్నో లీగ్‌లు ఆడియెన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని లీగ్‌లు మొదలవుతాయని సమాచారం. అసలు ఈ లీగ్స్ అన్నింటికీ మూల కారణం భారత్‌లో నిర్వహించే ఐపీఎల్ అని చెప్పొచ్చు. టెస్టు క్రికెట్ క్రమంగా ప్రాభవం కోల్పోతున్న వేళ, వన్డే క్రికెట్ కంటే టీ20 ఫార్మాట్‌కు మంచి ఫ్యూచర్ ఉంటుందని గుర్తించింది బీసీసీఐ. అనుకున్నదే తడవుగా ఐపీఎల్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటిదాకా ఐపీఎల్ సూపర్ సక్సెస్ అవుతూ వచ్చింది. అయితే ఈ లీగ్స్ వల్ల ఆటగాళ్లపై చాలా విమర్శలు వస్తున్నాయి.
లీగ్స్‌లో ఆడే ప్లేయర్లపై రూ.కోట్ల వర్షం కురుస్తోంది. ఆటగాళ్లకు భారీ మొత్తంలో పారితోషికాలు చెల్లించేందుకు ఫ్రాంచైజీలు వెనుకాడటం లేదు. దీంతో లీగ్‌లో ఆడేందుకు క్రికెటర్లు సై అంటున్నారు. కావాలంటే తమ జాతీయ జట్లు ఆడే టోర్నీలకు డుమ్మా కొట్టేందుకూ వెనుకాడటం లేదు. లీగ్స్‌లో ఆడితే వచ్చే డబ్బులతో పోలిస్తే.. జాతీయ జట్లకు ఆడితే వచ్చే శాలరీ చాలా తక్కువ. దీంతో గాయాలైనా సరే, లీగ్‌లు పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంటున్నారు. ఈ ఎఫెక్ట్ ఆయా ప్లేయర్ల నేషనల్ టీమ్స్‌పై పడుతోంది. కీలక ఆటగాళ్లు ముఖ్యమైన సిరీస్‌లకు ఇంజ్యురీలతో దూరం కావడంతో జట్టు విజయావకాశాలపై దెబ్బ పడుతోంది. ఇప్పుడు ఒక ఆటగాడి వల్ల అఫ్గానిస్థాన్ పరిస్థితి అలాగే ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ఐపీఎల్-2023లో ఆడిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో అటు బాల్‌తో పాటు ఇటు బ్యాట్‌తోనూ రాణించాడు రషీద్.
ఐపీఎల్ పదహారో సీజన్లో 27 వికెట్లు తీసిన రషీద్.. టాప్ బౌలర్ల జాబితాలో రెండో ప్లేసులో నిలిచాడు. కాగా, రషీద్ ఖాన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. లోవర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బంది పడుతున్న ఈ అఫ్గాన్ ఆల్‌రౌండర్.. శ్రీలంకతో ఆడబోయే వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్లో రషీద్ గాయంతోనే ఆడాడని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గాయం ఉందని ముందే తెలిసినప్పుడు ఐపీఎల్ నుంచి బయటకు వచ్చి రెస్ట్ తీసుకోవాల్సిందని అంటున్నారు. కానీ రషీద్ మాత్రం దేశం కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇచ్చాడని.. అతడికి డబ్బులే ముఖ్యమని తిట్టిపోస్తున్నారు. రషీద్ తన దేశాన్ని మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. మరి.. రషీద్ ఖాన్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.