ఐపీఎల్-2023లో కొందరు యంగ్ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అందులో ఇద్దరు ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నారు. వీళ్లిద్దరి జోరు చూస్తుంటే త్వరలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేలాగే ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ ముంబై ఇండియన్స్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆ టీమ్ 6 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ కొట్టింది. 200 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో సారథి రోహిత్ శర్మ (7) తక్కువ స్కోరుకు వెనుదిరిగినా ముంబై భయపడలేదు. ఇషాన్ కిషన్ (42), సూర్యకుమార్ యాదవ్ (83), నెహాల్ వధేరా (52)ల బ్యాటింగ్ ధాటికి కొండంత లక్ష్యం చిన్నబోయింది. ముంబై 16.3 ఓవర్లలో మ్యాచ్‌ను ఫినిష్ చేసి నెట్ రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకుంది. ముంబై ఇన్నింగ్స్‌లో సూర్య కుమార్ తర్వాత యంగ్ బ్యాటర్ నెహాల్ వధేరా బ్యాటింగ్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఆర్సీబీతో మ్యాచ్‌లో 22 ఏళ్ల వధేరా (34 బాల్స్‌లో 52) చెలరేగి ఆడాడు.
సూర్యకుమార్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మను ఎలా కట్టడి చేయాలా అని ఆర్సీబీ ప్లాన్స్ వేసుకుని వచ్చింది. అయితే రోహిత్ ఫెయిలైనా.. ఇషాన్, సూర్య సక్సెస్ అయ్యారు. అనూహ్యంగా నెహాల్ వధేరా కూడా బాగా ఆడటంతో బెంగళూరు బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ మ్యాచ్‌తో పాటు గతవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గేమ్‌లోనూ నెహాల్ చెలరేగి ఆడాడు. ఆ మ్యాచ్‌లో 64 రన్స్ చేసి తన సత్తా చాటాడు. ఐపీఎల్ మినీ వేలంలో రూ.20 లక్షలకు నెహాల్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఆ ధర కంటే ఎన్నో రెట్లు బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు వధేరా. పంజాబ్‌కు చెందిన నెహాల్ వధేరా 2018లో జరిగిన అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీతో వెలుగులోకి వచ్చాడు. ఆ టోర్నీలో ఆరు హాఫ్ సెంచరీలు బాదిన ఈ యంగ్ లెఫ్టాంటెడ్ బ్యాటర్.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత రంజీల్లో ఆడే ఛాన్స్‌ను దక్కించుకున్నాడు.
అరంగేట్ర రంజీ సీజన్లో దుమ్మురేపాడు నెహాల్ వధేరా. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో (123) సెంచరీ చేసిన ఈ యంగ్ బ్యాటర్.. అనంతరం మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఏకంగా 214 రన్స్ చేసి ఔరా అనిపించాడు. మొత్తంగా ఆ టోర్నీలో 53.71 సగటుతో 376 రన్స్ చేసి మెప్పించాడు. ఈసారి ఐపీఎల్లో ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి తానేంటో నిరూపించుకుంటున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో నెహాల్ కొట్టిన ఒక సిక్స్ ఏకంగా 101 మీటర్ల దూరం వెళ్లింది. తిలక్ వర్మ తర్వాత ముంబై సారథి రోహిత్‌ను ఎక్కువగా ఆకట్టుకున్న మరో యంగ్‌స్టర్ నెహాలే. అతడి బ్యాటింగ్ తీరు, రోహిత్ అతడికి వరుస ఛాన్స్‌లు ఇస్తుండటం చూస్తుంటే.. త్వరలో టీమిండియాలోకి ఈ లెఫ్టాండర్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరి.. రోహిత్‌ను ఇంప్రెస్ చేసిన నెహాల్ భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.