కోహ్లీతో గొడవనే లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ అస్సలు మర్చిపోలేకపోతున్నాడు. గత కొన్నిరోజుల నుంచి రెచ్చగొడుతున్న నవీన్.. ఇప్పుడు కోహ్లీని అవమానించేలా ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది.
విరాట్ కోహ్లీకి కోపమెక్కువ! ఇది క్రికెట్ ఫ్యాన్స్ కి చాలావరకు తెలుసు. అప్పట్లో మంచి ఫైర్ మీద ఉండేవాడు. కానీ పెళ్లయి, కూతురు పుట్టిన తర్వాత నుంచి విరాట్ చాలావరకు మారిపోయాడు. కొన్నేళ్ల ముందు ఫామ్ కూడా కోల్పోవడంతో చాలావరకు సైలెంట్ గానే ఉంటూ వచ్చాడు. ఈసారి ఐపీఎల్ తన పనేదో తాను చేసుకుంటా అన్నట్లు ఉన్నాడు. కానీ లక్నోతో మ్యాచ్ సందర్భంగా పెద్ద రచ్చ అయిపోయింది. మెంటార్ గంభీర్, బౌలర్ నవీన్ ఉల్ హక్ తో కోహ్లీకి పెద్ద గొడవ జరిగింది. ఇది జరిగి చాలా రోజులు అవుతున్నప్పటికీ.. ఇంకా దాని గురించి లక్నో బౌలర్ నవీన్ మర్చిపోవడం లేదు. దాన్ని మరింత పెద్దది చేయాలని చూస్తున్నాడు.
అసలు విషయానికొచ్చేస్తే.. ఆర్సీబీ ఈసారి ఐపీఎల్ లో కప్ కొడుతుందేమోనని ఆశ కలిగించింది. లీగ్ దశలో బాగానే ఆడినప్పటికీ.. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో చేతులెత్తేసింది. గుజరాత్ తో ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 197/5 స్కోరు చేసింది. కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఛేదనలో గుజరాత్ ఓపెనర్ గిల్ శతకంతో రెచ్చిపోయాడు. దీంతో 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసిన గుజరాత్ మ్యాచ్ గెలిచేసింది. ఆర్సీబీ ఆశల్ని చిదిమేసింది. దీంతో మరోసారి కప్ కొట్టకుండానే ఆర్సీబీ ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్ లో గెలిచుంటే ప్లే ఆఫ్స్ లో లక్నోతో ఆర్సీబీ.. ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుండేది. కానీ ఆర్సీబీ ఓడిపోవడంతో.. నవీన్ ఉల్ హక్ తన ఇన్ స్టా స్టోరీలో ఓ యాంకర్ నవ్వుతున్నట్లు ఉన్న వీడియోని పోస్ట్ చేశాడు. సరిగ్గా ఆర్సీబీ మ్యాచ్ తర్వాత ఇదే పెట్టాడు. దీంతో అందరికీ విషయం అర్థమైపోయింది. కావాలనే కోహ్లీని అవమానించేలా, గొడవని మరింత పెద్దది చేయడం కోసమే ఇలా చేశాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ఈ విషయంలో మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.